నీట్‌లో 67 మందికి ప్రథమ ర్యాంకు ఎలా సాధ్యం?

నీట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించి విచారణ జరిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 09 Jun 2024 05:07 IST

1500 మందికే గ్రేస్‌ మార్కులు కలపడంలో ఆంతర్యమేమిటి!
అవకతవకలపై విచారణ జరిపించండి
కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన కేటీఆర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించి విచారణ జరిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని శనివారం ‘ఎక్స్‌’ వేదికగా డిమాండ్‌ చేశారు. ‘గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 67 మంది 720కి 720 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు పొందడం అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు ఈసారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నెగెటివ్‌ మార్కులున్నప్పుడు 718, 719 మార్కులు రావడం అసాధ్యం. దీని గురించి ప్రశ్నిస్తే గ్రేస్‌ మార్కులు ఇచ్చామని చెప్పడం అసంబద్ధం. కొంత మందికి ఏకంగా 100 వరకు గ్రేస్‌ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తున్నప్పటికీ.. అందుకు ఏ విధానం అనుసరించారో చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ గ్రేస్‌ మార్కులు కలపాల్సి వస్తే ప్రతి విద్యార్థికీ మేలు చేసేలా ఈ విధానం ఉండాలి. అందుకు భిన్నంగా 1500 మంది విద్యార్థులకు మాత్రమే మేలు చేసేలా గ్రేస్‌ మార్కులు కలిపారు. నీట్‌ ఫలితాలను అనుకున్న గడువు కంటే ముందుగా ఇవ్వడం, అదీ ఎన్నికల ఫలితాల రోజే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది. విచారణ జరపడం ద్వారా జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేయాలి. అక్రమార్కులను కఠినంగా శిక్షించాలి’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ఒక్క విద్యార్థీ టాప్‌ 5 ర్యాంకర్ల జాబితాలో లేకపోవడానికి పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలే కారణమని తాము నమ్ముతున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని