నీతీశ్‌కు ప్రధాని పదవి ఇస్తామన్న ఇండియా కూటమి!

కేంద్రంలో భాజపాను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి.. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు ప్రధాన మంత్రిగా అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు జేడీ(యూ) వర్గాలు వెల్లడించాయి.

Published : 09 Jun 2024 05:09 IST

ఎన్డీయేలోనే ఉంటామని చెప్పాం: త్యాగి

దిల్లీ: కేంద్రంలో భాజపాను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి.. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు ప్రధాన మంత్రిగా అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు జేడీ(యూ) వర్గాలు వెల్లడించాయి. ఆయన మాత్రం భాజపాతో పొత్తును తెంచుకుని వచ్చేది లేదంటూ ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు జేడీ(యూ) జాతీయ సలహాదారుడు, అధికార ప్రతినిధి కె.సి.త్యాగి పలు ఆంగ్ల మాధ్యమాలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ‘‘ప్రధానమంత్రి పదవి గురించి నేరుగా నీతీశ్‌ను కలిసేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మేం ఎన్డీయే కూటమితో ఉన్నాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు’’ అని త్యాగి పేర్కొన్నారు. తెదేపా, జేడీయూ మద్దతు ఇచ్చినట్లయితే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేలా ఇండియా కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో నీతీశ్‌కు వచ్చిన ఆఫర్‌ గురించి ఆయన వెల్లడించారు. నీతీశ్‌ను ఇండియా కూటమికి కన్వీనర్‌గా చేయడానికి నిరాకరించినవారే ఇప్పుడు ఏకంగా ప్రధాని పదవి ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఎద్దేవా చేశారు.  

తోసిపుచ్చిన సంజయ్‌ ఝా 

జేడీ(యూ) ఎంపీ, నీతీశ్‌ ఆంతరంగికుడు సంజయ్‌ ఝా తమ సొంతపార్టీ నేత త్యాగి మాటల్ని ఖండించారు. ‘..ఇలాంటి సమాచారం మా పార్టీకి గానీ, ముఖ్యమంత్రికి గానీ తెలియదు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేయదలచుకున్నా’ అని చెప్పారు. త్యాగి వెల్లడించిన వివరాలను కాంగ్రెస్‌ ఖండించింది. ఇలాంటి సమాచారమే తమకు లేదని, ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసునని ఆ పార్టీ నేత కె.సి.వేణుగోపాల్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని