కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి పాలన

కేంద్రంలో సమీప భవిష్యత్తులో ఇండియా కూటమి పాలన చూస్తామంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Published : 09 Jun 2024 05:09 IST

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

కోల్‌కతా: కేంద్రంలో సమీప భవిష్యత్తులో ఇండియా కూటమి పాలన చూస్తామంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఈరోజు తమ కూటమి ముందుకు రాలేదు అంటే.. రేపు కూడా అదే వైఖరి ఉంటుందన్న అర్థం కాదని నర్మగర్భంగా అన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాబోమని స్పష్టం చేశారు. తమను ఎవరూ ఆహ్వానించలేదని, హాజరుకావాలని తాము కూడా కోరుకోవడం లేదన్నారు. టీఎంసీ ఎంపీలు, సీనియర్‌ నేతలతో శనివారం ఇక్కడ జరిగిన సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. టీఎంసీ వేచిచూసే వైఖరి అనుసరిస్తుందని.. భాజపా సారథ్యంలోని బలహీనమైన, అస్థిర ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతే తాను సంతోషిస్తానన్నారు. ‘‘భాజపా అప్రజాస్వామిక విధానంలో అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. చివరకు వచ్చేది ఇండియా కూటమి సర్కారే. అప్పటిదాకా వాళ్లెలా ప్రభుత్వాన్ని నడుపుతారో చూస్తాం’’ అన్నారు. జేడీయూ, తెదేపా తమకు మిత్రపక్షాలేనంటూ.. ఆ పార్టీలు మాతో లేవని మీకు ఎవరు చెప్పారు? అని ఓ ప్రశ్నకు సమాధానంగా మమత ఎదురు ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినందున, ఆయన పక్కకు తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. లోక్‌సభలో టీఎంసీ నేతగా సుదీప్‌ బందోపాధ్యాయ్‌ వ్యవహరిస్తారని మమత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని