లోక్‌సభకు పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నేత

విపక్ష ఇండియా కూటమి సభ్యుల సంఖ్య 18వ లోక్‌సభలో గణనీయంగా పెరగడంతో పదేళ్ల తర్వాత పార్లమెంటులోని దిగువ సభకు అధికారికంగా ప్రతిపక్ష నేతను నియమించే అవకాశం ఏర్పడింది.

Published : 10 Jun 2024 05:06 IST

 ఈ దఫా డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాయమని ఆశిస్తున్న విపక్షం

దిల్లీ: విపక్ష ఇండియా కూటమి సభ్యుల సంఖ్య 18వ లోక్‌సభలో గణనీయంగా పెరగడంతో పదేళ్ల తర్వాత పార్లమెంటులోని దిగువ సభకు అధికారికంగా ప్రతిపక్ష నేతను నియమించే అవకాశం ఏర్పడింది. దీంతోపాటు డిప్యూటీ స్పీకర్‌ పదవి కూడా తమకు వస్తుందని విపక్షాలు భావిస్తున్నాయి. గత అయిదేళ్లుగా డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగానే ఉంది. ఈ నెల 5న రద్దయిన 17వ లోక్‌సభకు పూర్తిస్థాయి డిప్యూటీ స్పీకర్‌ లేరు. నూతన లోక్‌సభలో తమ బలం పెరగడంతో డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఖాళీగా ఉంచరాదని డిమాండ్‌ చేయనున్నట్లు విపక్ష కూటమి నేతలు తెలిపారు. సాధారణంగా ఈ పదవిని ప్రతిపక్షాలకే కేటాయిస్తుంటారు. 

 విపక్ష హోదా పొందే ఎంపీల సంఖ్య ప్రతిపక్షంలోని ఏ పార్టీకీ లేకపోవడంతో 2014 నుంచి దిగువ సభలో ప్రతిపక్ష నేత పదవి ఎవరికీ లభించలేదు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ 99 స్థానాల్లో గెలుపొందడంతో ఈ దఫా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లభించనుంది. ఈ పదవిని చేపట్టాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శనివారం రాహుల్‌ గాంధీని కోరుతూ తీర్మానం చేయగా త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. లోక్‌సభ మొత్తం సభ్యుల్లో కనీసం పదో వంతు మంది ఎంపీలు(55) కలిగిన పార్టీకి విపక్ష నేత హోదా అర్హత లభిస్తుంది. 2014, 2019లలో కాంగ్రెస్‌కు ఆ స్థాయిలో సభ్యులు లేనందున సభాపతి ఆ పదవిని కేటాయించలేదు. విపక్ష నేతగా గుర్తింపు పొందిన వారికి కేబినెట్‌ మంత్రి స్థాయి హోదా లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని