మోదీకి దేవుడి సంపూర్ణ ఆశీస్సులు.. అభినందనలు తెలుపుతూ దేవేగౌడ లేఖ

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతిస్తున్నట్లు మాజీ ప్రధాని, జేడీ(ఎస్‌) అధినేత హెచ్‌.డి.దేవేగౌడ తెలిపారు.

Published : 10 Jun 2024 05:23 IST

దిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతిస్తున్నట్లు మాజీ ప్రధాని, జేడీ(ఎస్‌) అధినేత హెచ్‌.డి.దేవేగౌడ తెలిపారు. జేడీ(ఎస్‌) తరఫున తన కుమారుడు హెచ్‌.డి.కుమారస్వామికి కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ఆయన ఆదివారం లేఖ రాశారు. వరుసగా మూడోసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా చరిత్ర సృష్టించిన మోదీని అభినందించారు. దేవుడి సంపూర్ణమైన, అసాధారణమైన దీవెనలు ఉన్నందునే ఇటీవలి ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయం సాధించారని పేర్కొన్నారు. గత దశాబ్దం మాదిరిగా భవిష్యత్తులోనూ దృఢమైన అంకిత భావంతో దేశానికి సేవ చేయగలరని దేవేెగౌడ అభిలషించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీపై విమర్శలు సంధించారు. ఇండియా కూటమిలోని పక్షాలతో పొత్తుల వల్లే కాంగ్రెస్‌కు స్వల్ప విజయాలు లభించాయన్నారు. అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఆ పార్టీ పనితీరు ఏ మాత్రం మెరుగుపడలేదని తెలిపారు. ఆరోగ్య సమస్యల వల్లే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వలేకపోయినట్లు లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని