దశాబ్దాలుగా సంకీర్ణ వెలుగులు!

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కేంద్రంలో వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇది సంకీర్ణ ప్రభుత్వం.

Updated : 10 Jun 2024 07:00 IST

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కేంద్రంలో వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇది సంకీర్ణ ప్రభుత్వం. సొంతంగా మెజార్టీ రాకపోవడంతో.. ప్రస్తుతం తెలుగుదేశం, జేడీయూ తదితర మిత్రపక్షాల మద్దతుపై కమలదళం ఆధారపడక తప్పని పరిస్థితి. మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం కొత్తేమీ కాదు. గతంలో పలువురు కీలక నేతల నాయకత్వంలో ఇలాంటి సర్కార్లు పాలనాపగ్గాలు చేపట్టాయి. ఆ దాఖలాలను పరిశీలిస్తే.. 


మొరార్జీ దేశాయ్‌ 
(1977 మార్చి - 1979 జులై) 

దేశంలో తొలి ప్రధాన సంకీర్ణ సర్కారు 1970ల్లో ఏర్పాటైంది. ఆత్యయిక స్థితి తర్వాత 1977 మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అంతకంటే కేవలం రెండు నెలల ముందే.. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని గద్దె దింపాలన్న పట్టుదలతో జనసంఘ్, కాంగ్రెస్‌ (ఒ), భారతీయ లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఏకమై జనతా పార్టీగా అవతరించాయి. జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి 270 సీట్లు వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో దాని ప్రభంజనం కనిపించింది. ఫలితంగా కేంద్రంలో జనతా పార్టీ (విపక్ష పార్టీల సంకీర్ణం) ప్రభుత్వం ఏర్పాటైంది. మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 153 సీట్లకు పరిమితమైంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనే హస్తం పార్టీకి ఊరడింపు దక్కింది.


చరణ్‌ సింగ్‌
(1979 జులై - 1980 జనవరి)

సైద్ధాంతిక విభేదాలకు రాజకీయ కారణాలూ తోడవడంతో జనతా పార్టీ రెండేళ్లలోనే చీలిపోయింది. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన చరణ్‌సింగ్‌ జనతా పార్టీ నుంచి బయటకు రావడంతో మొరార్జీ దేశాయ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అనంతరం జనతాపార్టీ (సెక్యులర్‌), కాంగ్రెస్‌ (యుఆర్‌ఎస్‌), కాంగ్రెస్‌ (ఐ) మద్దతుతో చరణ్‌సింగ్‌ 1979 జులై 28న ప్రధాని పీఠమెక్కారు. కానీ ఆత్యయిక స్థితి సమయంలో చర్యలకు సంబంధించి ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్‌గాంధీలపై నమోదైన క్రిమినల్‌ అభియోగాలను కొట్టివేయాలన్న డిమాండ్‌కు తలొగ్గకపోవడంతో ప్రభుత్వానికి కాంగ్రెస్‌ (ఐ) తన మద్దతు ఉపసంహరించుకుంది. ఫలితంగా కేవలం 23 రోజుల్లోనే చరణ్‌సింగ్‌ ప్రభుత్వం కూలిపోయింది. 


వి.పి.సింగ్‌ 
(1989 డిసెంబరు - 1990 నవంబరు)

1980లు, 90ల్లో పలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంఖ్యాబలం 197కు పడిపోయింది. రామ జన్మభూమి ఉద్యమం ఊపుతో బరిలో దిగిన భాజపా 85 సీట్లు గెల్చుకుంది. వామపక్షాలకు 33 స్థానాలు దక్కాయి. భాజపా బయటి నుంచి మద్దతివ్వడంతో- వి.పి.సింగ్‌ (జనతాదళ్‌) నేతృత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ సర్కారు ఏర్పాటైంది. కాంగ్రెస్‌ (ఎస్‌), తెలుగుదేశం, డీఎంకే, అసోం గణ పరిషద్‌ అందులోని భాగస్వామ్య పక్షాలు. 


చంద్రశేఖర్‌
(1990 నవంబరు - 1991 జూన్‌)

దేవీలాల్‌తో కలిసి చంద్రశేఖర్‌ జనతాదళ్‌ను చీల్చడంతో.. వి.పి.సింగ్‌ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్‌తో జట్టు కట్టి.. 1990 నవంబరు 10న చంద్రశేఖర్‌ ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే దిల్లీలోని రాజీవ్‌గాంధీ నివాసంలో ఇద్దరు హరియాణా పోలీసులు నిఘా వేశారన్న ఆరోపణల నేపథ్యంలో హస్తం పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏడు నెలల్లోనే చంద్రశేఖర్‌ సర్కారు కూలిపోయింది. 


హెచ్‌.డి.దేవేగౌడ 
(1996 జూన్‌ - 1997 ఏప్రిల్‌)

పి.వి.నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, థర్డ్‌ ఫ్రంట్‌ మధ్య త్రిముఖ పోరు కనిపించింది. థర్డ్‌ ఫ్రంట్‌కు జనతాదళ్‌ సారథ్యం వహించింది. సమాజ్‌వాదీ పార్టీ, తెదేపా, డీఎంకే, అసోం గణ పరిషద్, అఖిల భారత ఇందిరా కాంగ్రెస్‌ (తివారీ), వామపక్షాలు, తమిళ్‌ మాణిల కాంగ్రెస్, జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫెరెన్స్, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ అందులోని భాగస్వామ్య పక్షాలు. ఎన్నికల్లో భాజపాకు 161, కాంగ్రెస్‌కు 140 సీట్లు వచ్చాయి. జనతాదళ్‌ 46 సీట్లకు పరిమితమైంది. మొత్తంగా థర్డ్‌ ఫ్రంట్‌కు 136 సీట్లు దక్కాయి. ప్రధానిగా వాజ్‌పేయీ ప్రమాణం చేసినా.. బల నిరూపణలో విఫలమవడంతో 13 రోజుల్లోనే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం కాంగ్రెస్, థర్డ్‌ఫ్రంట్‌ మద్దతుతో దేవేగౌడ 1996 జూన్‌ 2న ప్రధాని పీఠమెక్కారు. యునైటెడ్‌ ఫ్రంట్‌గా పిలిచిన ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ వెలుపలి నుంచే మద్దతిచ్చింది. 


ఐ.కె.గుజ్రాల్‌ 
(1997 ఏప్రిల్‌ - 1998 మార్చి)

యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారుకు కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో.. విశ్వాస పరీక్షలో నెగ్గలేక దేవేగౌడ 1997 ఏప్రిల్‌ 11న రాజీనామా చేశారు. అనంతరం- దేవేగౌడ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఐ.కె.గుజ్రాల్‌.. జ్యోతిబసు, లాలూప్రసాద్‌ యాదవ్, కృష్ణకాంత్‌ తదితర నేతల అండతో ప్రధాని పదవిని చేపట్టారు. ఆయన సర్కారు (యునైటెడ్‌ ఫ్రంట్‌-2)కు కాంగ్రెస్‌ వెలుపలి నుంచి మద్దతిచ్చింది. తిరిగి అది తన మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏడు నెలలకే గుజ్రాల్‌ సర్కారు పడిపోయింది. 

ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు వాజ్‌పేయీ ప్రధానిగా భాజపా నేతృత్వంలో ఎన్డీయే సర్కారు, 2004-2014 మధ్య మన్మోహన్‌సింగ్‌ ప్రధానమంత్రిగా కాంగ్రెస్‌ నాయకత్వంలో యూపీఏ-1, 2 ప్రభుత్వాలు దేశాన్ని పాలిచాయి. 2014 నుంచీ మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు కొనసాగుతోంది. 


నెహ్రూ.. రెండు సంకీర్ణాలు!

స్వాతంత్య్రానికి పూర్వం కూడా 1946లో అత్యంత సంక్లిష్టమైన సంకీర్ణాన్ని మన దేశం చూసింది. కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ కలసి ఏర్పాటుచేసిన సంకీర్ణమది. బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ అధ్యక్షుడిగా, జవహర్‌లాల్‌ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా ఏర్పడ్డ ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ నుంచి వల్లబ్‌భాయ్‌ పటేల్, రాజేంద్రప్రసాద్, జగ్జీవన్‌ రామ్‌ తదితర దిగ్గజ నేతలు ఉన్నారు. కీలకమైన ఆర్థిక శాఖను లీగ్‌కు (లియాఖత్‌ అలీఖాన్‌కు) కేటాయించారు. మథాయ్‌ నుంచి ఆర్థిక శాఖను లియాఖత్‌కు అప్పగించడం, ఆయనేమో తన అనుమతి లేకుండా అటెండర్‌ను కూడా నియమించటానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేయటం వివాదాలకు కారణమైంది. అన్నింటికీ సర్దిచెబుతూ నెహ్రూ సంకీర్ణాన్ని నడిపించారు. 1947లో స్వాతంత్య్రం తర్వాత తన సారథ్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలోనూ నెహ్రూ సంకీర్ణ ధర్మాన్ని పాటించారు. 1946 తాత్కాలిక ప్రభుత్వంలోని సగం మందిని కొనసాగిస్తూ... కాంగ్రెసేతర నాయకులకు, తనను గట్టిగా విమర్శించేవారికి కూడా కేబినెట్‌లో చోటు కల్పించారు. అంబేడ్కర్‌ (న్యాయశాఖ), ఆర్‌.కె.షణ్ముఖం చెట్టి (ఆర్థికశాఖ), శ్యాంప్రసాద్‌ ముఖర్జీ (పరిశ్రమలు) తదితర దిగ్గజాలు అందులో ఉన్నారు. 


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని