24.37 లక్షల మెట్రిక్‌ టన్నుల క్వార్ట్జ్‌ దోపిడీ

వైకాపా నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకొని నెల్లూరు జిల్లాల్లో క్వార్ట్జ్‌ ఖనిజాన్ని భారీగా దోచుకున్నారు. ఏకంగా 24.37 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర అక్రమంగా తవ్వి తరలించినట్లు బయటపడింది.

Updated : 11 Jun 2024 06:37 IST

అక్రమంగా తవ్వి.. తరలించిన వైకాపా నేతలు
ఇతర జిల్లాల ట్రాన్సిట్‌ ఫామ్స్‌ వినియోగం
కేంద్రానికి సోమిరెడ్డి ఫిర్యాదుతో కదిలిన అధికారులు
275 కేసుల నమోదు, రూ.255.55 కోట్ల జరిమానా  

ఈనాడు-అమరావతి, నెల్లూరు: వైకాపా నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకొని నెల్లూరు జిల్లాల్లో క్వార్ట్జ్‌ ఖనిజాన్ని భారీగా దోచుకున్నారు. ఏకంగా 24.37 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర అక్రమంగా తవ్వి తరలించినట్లు బయటపడింది. పొదలకూరు, సైదాపురం, రాపూరు మండలాల్లో లభించే హైగ్రేడ్‌ క్వార్ట్జ్‌ను అనుమతులు లేకుండా తవ్వకాలు చేయడంతోపాటు దాన్ని చైనాకు ఎగుమతి చేసి భారీగా వెనకేసుకున్నారు. చైనాలో మెట్రిక్‌ టన్నుకు రూ.30 వేల వరకు ధర పలుకుతుండటంతో అంతా కలిసి దోపిడీ చేశారు. పొదలకూరు మండలంలో పలుచోట్ల అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ దందా సాగింది. సైదాపురం, రాపూరు మండలాల్లోని ఇతర వైకాపా నేతలు సైతం ఇష్టానుసారం తవ్వకాలు సాగించారు. జిల్లాలో ఎవరు తవ్వి, తరలించినా.. వారి నుంచి మెట్రిక్‌ టన్నుకు రూ.7 వేలు చొప్పున మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ముక్కుపిండి వసూలు చేశారు. తనకు కప్పం కడితే చాలు, ఎంత తవ్వుకున్నా.. ఎవరూ అడ్డుకోకుండా ఆయన దందా నడిపించారు.

మరోవైపు పొదలుకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌ లీజు గడువు ముగియగా, లీజుదారుడు దాన్ని రెన్యువల్‌ చేయాలని దరఖాస్తు చేశారు. ఆ అనుమతులు రాకుండానే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అందులోకి అక్రమంగా చొరబడి, తన మనుషుల ద్వారా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు. నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రుస్తుం మైన్స్‌లో కాకాణి గోవర్ధన్‌రెడ్డి దౌర్జన్యంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గనుల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారెవరూ స్పందించలేదు. రుస్తుం మైన్స్‌ వద్ద కాకాణి దౌర్జాన్యానికి నిరసనగా రెండు రోజులపాటు సత్యాగ్రహ దీక్ష కూడా చేశారు. చివరకు వైకాపా నేతల దోపిడీ తారస్థాయికి చేరడంతో సోమిరెడ్డి కేంద్ర గనుల శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని కేంద్రం నుంచి రాష్ట్ర గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఏప్రిల్‌ ఒకటి నుంచి మే నెలాఖరు వరకు గనుల శాఖ అధికారులు తనిఖీలు చేయగా, ఇంతకాలం సాగిన దోపీడీ బట్టబయలైంది. బాధ్యులపై 275 కేసులు నమోదు చేయడంతోపాటు ఏకంగా రూ.255.55 కోట్ల జరిమానా విధించారు. 

అంతటా అక్రమాలే..

  • అధికారుల తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. 14 మినరల్‌ డీలర్‌ లైసెన్స్‌దారుల (ఎండీఎల్స్‌) వద్ద 20,635 మెట్రిక్‌ టన్నుల క్వార్ట్జ్‌ అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు.
  • మినరల్‌ డీలర్‌ లైసెన్సుదారులు చెల్లించిన జీఎస్టీకి, రవాణా చేసిన పరిమాణం లెక్కలు చూస్తే.. 2.30 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా తరలించినట్లు తేల్చారు. వీరిపై 38 కేసులు నమోదు చేశారు.
  • ఇతర జిల్లాలకు చెందిన ట్రాన్సిట్‌ ఫామ్స్‌ కొనుగోలు చేసి, వాటి ద్వారా 1.12 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ఖనిజాన్ని తరలించినట్లు వెలుగు చూసింది. వీటిపై 22 కేసులు నమోదు చేశారు.
  • 9 లీజుల్లో 2.11 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా తవ్వి తరలించినట్లు బయటపడింది. 
  • 14 మంది లీజుదారులు.. 2.18 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర తవ్వి, వాటికి పనిచేయని లీజుల పేరిట ట్రాన్సిట్‌ ఫామ్స్‌ను తీసుకొని రవాణా చేశారని తేలింది.
  • 14 లీజుల్లో కొలతలు వేస్తే.. 16.34 లక్షల మెట్రిక్‌ టన్నులు అక్రమంగా తరలిపోయినట్లు గుర్తించారు. 
  • వీటన్నింటికి కలిపి 111 కేసులు నమోదు చేసిన అధికారులు రూ.253.87 కోట్ల మేర జరిమానాలు విధించారు.
  • ఎటువంటి లీజులు లేనిచోట్ల తవ్వకాలు చేస్తున్న వారిపై 109 కేసులు నమోదు చేశారు. వీరికి 13.22 లక్షల జరిమానా వేశారు.
  • పర్మిట్లు లేకుండా లారీల్లో తరలిస్తున్న క్వార్ట్జ్‌ను పట్టుకొని 55 కేసులు నమోదు చేయగా, వీరికి 1.67 కోట్ల జరిమానా విధించారు.
  • 1.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని సీజ్‌ చేశారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని