ప్రజల కోసం పనిచేస్తున్నందుకే పగబట్టారు

రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయనే ఈడీ, సీబీఐని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయోగిస్తోందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.

Updated : 02 Dec 2022 08:20 IST

నాపై కేసు భాజపా నీచ రాజకీయ ఎత్తుగడే
మోదీ కంటే ముందే ఈడీ రావడం సహజమే!
దర్యాప్తు సంస్థలు ప్రశ్నలు అడిగితే సమాధానమిస్తా  
తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయనే ఈడీ, సీబీఐని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయోగిస్తోందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తాజాగా తనపై కేసులు నీచమైన రాజకీయ ఎత్తుగడేనని, ప్రజల కోసం పని చేస్తున్నందుకే పగబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గురువారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. భాజపా చౌకబారు ఎత్తుగడలను ప్రజలే తిప్పికొట్టి తగిన గుణపాఠం చెబుతారన్నారు. పద్ధతి మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

జైల్లో పెడతామంటే పెట్టుకోండి..

‘‘ఈడీ, సీబీఐలతో భాజపా ఎన్నికల్లో గెలవాలనుకుంటోంది. అయితే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. భాజపా ప్రభుత్వ ఆగడాలు ఇక్కడ నడవవు. ప్రజలు మా వెంట ఉన్నారు. వారి మద్దతు ఉన్నంతకాలం మాకు ఇబ్బంది లేదు’’ అని కవిత పేర్కొన్నారు. ‘‘దేశంలో భాజపా పాలన వచ్చి ఎనిమిదేళ్లయింది. తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టింది. వచ్చే డిసెంబరులో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. మోదీ వచ్చే కంటే ముందే రాష్ట్రానికి ఈడీ వచ్చింది. ఎన్నికలకు ముందు ఈడీలతో సోదాలు చేయించడం సహజమే. నాపై, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమే. కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి.. జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు? ఉరి తీస్తారా? దేనికీ భయపడేది లేదు. మీడియాకు లీకులిచ్చి మా ప్రతిష్ఠను దెబ్బతీయలేరు. దర్యాప్తు సంస్థలు ప్రశ్నలు అడిగితే సమాధానమిస్తా. సీఎం కేసీఆర్‌ భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన భాజపాను గడగడలాడించింది. విద్వేష రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు మేము కట్టుబడి ఉన్నాం. వారికి సేవ చేసే విషయంలో మమ్మల్ని ఏ శక్తీ ఆపలేదు. విచ్ఛిన్నకర, కుటిల రాజకీయ శక్తులను పాతర పెట్టిన చరిత్ర తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలకు ఏం చేస్తామన్నది చెప్పుకొని గెలవాలి తప్ప ఇలాంటి చర్యలకు పాల్పడి కాదు. మీరు ఎన్ని చేసినా ప్రజల కోసం భాజపాపై పోరాటం కొనసాగిస్తాం. ఆ పార్టీ వైఫల్యాలను ఎండగడతాం’’ అని కవిత తెలిపారు.

కవితకు తెరాస శ్రేణుల సంఘీభావం

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపాయి. గురువారం తెల్లవారుజామునే పార్టీ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, కార్పొరేషన్ల ఛైర్మన్లు రాజీవ్‌సాగర్‌, అనిల్‌ తదితర నేతలు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఆమె ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమెపై అక్రమంగా కేసు నమోదయిందని, ఉద్దేశపూర్వకంగా ఈడీ దిల్లీ మద్యం కేసులో ఇరికించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. భాజపాకు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా... సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, కవితలకు అనుకూలంగా నినదించారు. కవిత వారి వద్దకు వచ్చి అభివాదం చేయగా... ‘మీరు భాజపాపై పోరాడండి. మేము మద్దతుగా ఉంటాం’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని