Raghurama: రికార్డింగ్‌ డ్యాన్స్‌లతో పెట్టుబడులు వస్తాయా?

మంత్రుల రికార్డింగ్‌ డ్యాన్సులతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, అంబటి రాంబాబు, రోజా డ్యాన్సులు వేస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.

Updated : 04 Dec 2022 07:01 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: మంత్రుల రికార్డింగ్‌ డ్యాన్సులతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, అంబటి రాంబాబు, రోజా డ్యాన్సులు వేస్తున్న ఫొటోలను ప్రదర్శించారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలను కలిసేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమయం ఇవ్వరని, ఎవరైనా కలవాలనుకుంటే ఆయన ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు. ‘ఇప్పటికే రాష్ట్రం నుంచి రూ.1.70 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కిపోయాయి. ముఖ్యమంత్రి, మంత్రుల కబుర్లు కోటలు దాటుతున్నా పెట్టుబడులు, పరిశ్రమలు మాత్రం రావడం లేదు. చివరకు రూ.పది వేల కోట్ల పెట్టుబడులతో, పది వేల మందికి ఉపాధి కల్పించే అమర్‌రాజా బ్యాటరీ సంస్థ కూడా పొరుగు రాష్ట్రానికి తరలి వెళ్లింది’ అని రఘురామ విమర్శించారు.

నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది

తనకున్న సమాచారం మేరకు... దిల్లీ మద్యం కుంభకోణంలో ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు. ఈ కుంభకోణంలో దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా తమ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొందని గుర్తు చేశారు.  దిల్లీ మద్యం కుంభకోణంలో ధ్వంసమైన ఫోన్లన్నింటికీ విజయసాయిరెడ్డి ఫోనే కీ ఫోన్‌ అని తెలుస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు సభలకు భారీగా హాజరైన ప్రజలను చూస్తే వైకాపా నేతగా బాధనిపిస్తున్నా... తాను తమ పార్టీ నుంచి ఈ దఫా పోటీ చేసేది లేదన్న ఆనందం తనకుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని