YSRCP: పుంగనూరులో వైకాపా శ్రేణుల వీరంగం

విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు.

Updated : 05 Dec 2022 07:48 IST

పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌ ఇంటిపై మూకుమ్మడి దాడి
ఫర్నిచర్‌, కార్లు ధ్వంసం

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతుల సమస్యలపై సదుంలో తలపెట్టిన రైతుభేరిని అనుమతి లేదంటూ ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఇంతలో వైకాపాకు వ్యతిరేకంగా సభ తలపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి వైకాపా కార్యకర్తలు పుంగనూరు పట్టణం కొత్తిండ్లు ఎల్‌ఐసీ కాలనీలో రామచంద్ర యాదవ్‌ కొత్త ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. కర్రలు, రాళ్లతో తలుపులు, అద్దాలు పగలకొట్టి లోపలకు వెళ్లి, ఫర్నిచర్‌ను విరగకొట్టారు. ఆవరణలోని ఆరు కార్లను ధ్వంసం చేశారు. రామచంద్ర ఓ గదిలో ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. తమ నాయకుడు సదుం వెళ్లకుండా పుంగనూరులోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు వైకాపా శ్రేణులు ఇంత విధ్వంసానికి దిగినా కళ్లప్పగించి చూస్తుండిపోయారని ఆయన మద్దతుదారులు మండిపడ్డారు.

200 మంది దూసుకొచ్చి..

సదుంలో రైతుభేరికి వెళ్లనీయకుండా రామచంద్ర యాదవ్‌ను నిలువరించిన పోలీసులు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు వదిలేశారు. దాంతో ఆయన తన అనుచరులు, మద్దతుదారులతో ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఇంటికి తిరిగివచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఆయన అనుచరులు ఎక్కువమంది ఇళ్లకు వెళ్లిపోయారు. దీన్ని గమనించిన వైకాపా కార్యకర్తలు సుమారు 200 మంది కర్రలు, రాళ్లతో రాత్రి 9.15 గంటల సమయంలో ఒక్కసారిగా ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. లోపలకు రాకుండా తాళాలు వేసినా రాళ్లు, కర్రలతో తలుపులు, అద్దాలను బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ఫర్నిచర్‌ విరగ్గొట్టారు. కార్ల అద్దాలు పగలకొట్టారు. సుమారు అర్ధగంటసేపు రణరంగం సృష్టించారు. రామచంద్ర అనుచరులు వెళ్లి చెప్పడంతో అక్కడికి వచ్చిన పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలను బతిమాలడమే తప్ప నిలువరించే యత్నం చేయలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీగా బలగాలు తరలివచ్చి స్వల్ప లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.

లాఠీఛార్జితో అదుపు చేశాం: డీఎస్పీ సుధాకర్‌రెడ్డి

కొందరు వ్యక్తులు మద్యం మత్తులో రామచంద్ర యాదవ్‌ ఇంటిపై దాడి చేస్తున్నారని తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నాం. లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాం. ఈ ఘటనపై ఇప్పటి వరకూ ఫిర్యాదు అందలేదు.

రామచంద్ర యాదవ్‌ ఆగడాలను ఓర్చుకోలేకపోతున్నారు: ఎంపీ రెడ్డెప్ప

రామచంద్ర యాదవ్‌ పుంగనూరు ప్రశాంతతను చెడగొట్టాలని చూస్తున్నారు. ఆయన ఆగడాలను ఇక్కడి ప్రజలు ఓర్చుకోలేకపోతున్నారు. అందుకు ఆయనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు ఎవరూ రామచంద్ర జోలికి వెళ్లడం లేదు. పవన్‌ కల్యాణ్‌ లాగా ఆయన కూడా రాత్రికి రాత్రే ఎదగాలని చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని