మర్రి శశిధర్‌రెడ్డికి లీగల్‌ నోటీసు పంపిన మాణికం ఠాగూర్‌

మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ లీగల్‌ నోటీసు పంపారు.

Published : 06 Dec 2022 05:15 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ లీగల్‌ నోటీసు పంపారు. ఆయన తరఫున న్యాయవాది ఆర్‌.అరవిందన్‌ సోమవారం నోటీసులిచ్చారు. ‘మీ తండ్రి మర్రి చెన్నారెడ్డి నుంచి మీ వరకు కాంగ్రెస్‌లో అనేక పదవులు పొందారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున మిమ్మల్ని కాంగ్రెస్‌ బహిష్కరించింది. భాజపాలో చేరాలని నిర్ణయించుకొని కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సందర్భంగా అగ్రనేత సోనియాగాంధీకి రాసిన లేఖలో, హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో.. పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్‌రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారని మాణికం ఠాగూర్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లపై నిరాధార ఆరోపణలు చేశారు. తద్వారా నా క్లయింట్‌కు రాజకీయంగా, పార్టీ శ్రేణుల్లో పరువుకు భంగం కలిగించారు’ అని అరవిందన్‌ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడికి క్షమాపణ లేఖ రాయాలన్నారు. లేని పక్షంలో న్యాయపరంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని