నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు

రెండు దశాబ్దాల పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్‌గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు.

Published : 18 May 2024 04:13 IST

రాయ్‌బరేలీ ప్రజలకు రాహుల్‌ను ఇస్తున్నా
మీ వాడిగా చూసుకోండి: సోనియా

రాయ్‌బరేలీ సభలో ప్రసంగిస్తున్న సోనియాగాంధీ. చిత్రంలో రాహుల్‌గాంధీ, ప్రియాంక 

రాయ్‌బరేలీ, అమేఠీ: రెండు దశాబ్దాల పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్‌గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. ‘‘నాకు సర్వస్వం ఇచ్చింది మీరే. ఇప్పుడు నా తనయుడిని మీకు ఇస్తున్నా. నన్ను మీ సొంత మనిషిగా చూసుకున్నట్లే రాహుల్‌నూ చూసుకోండి. ఆయన మిమ్మల్ని నిరాశపరచడు’’ అని చెప్పారు. శుక్రవారం రాయ్‌బరేలీలో ఎన్నికల సభలో రాహుల్, ప్రియాంకా గాంధీలతో కలిసి ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. ‘‘రాయ్‌బరేలీ ప్రజలు, మా అత్తయ్య ఇందిరాగాంధీ నాకు ఏ పాఠాలు నేర్పారో వాటినే రాహుల్, ప్రియాంకలకూ చెప్పాను. అందరినీ గౌరవించడం, బలహీనవర్గాలను రక్షించడం, ప్రజల హక్కులకు అన్యాయం జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడటం వంటివి వారికి నేర్పాను.  మా కుటుంబంతో ఈ నేలకు వందేళ్ల పైచిలుకు అనుబంధం ఉంది.  ఒక ఉద్యమంగా మొదలైన బంధం తరతరాలుగా కొనసాగుతోంది. ఇందిరకు మీరంటే ఎంతో అభిమానం. ఇరవయ్యేళ్లు మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. అదే నాకు జీవితంలో అతిపెద్ద ఆస్తి. ఇన్నిసార్లు నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు’’ అని సోనియా చెప్పారు.  

అమేఠీ, రాయ్‌బరేలీలను ఒకేలా చూస్తా: రాహుల్‌ 

తాను రాయ్‌బరేలీ నుంచి గెలిచినట్లయితే అభివృద్ధి విషయంలో అమేఠీ, రాయ్‌బరేలీలను సమానంగా చూస్తానని రాహుల్‌గాంధీ చెప్పారు. అమేఠీలో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.ఎల్‌.శర్మ తరఫున జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.  రెండుచోట్లా సభలకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, రెండు పార్టీల నేతలు హాజరయ్యారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు