Siddaramaiah: వారికి సీట్లిస్తే.. రాజకీయ వారసత్వమా: సిద్ధరామయ్య

రాజకీయ నాయకుల పిల్లలకు ఎన్నికల్లో టికెట్లు కేటాయించడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Published : 24 Mar 2024 20:15 IST

మైసూరు: మంత్రుల పిల్లలు, కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వడం వారసత్వ రాజకీయం కాదని కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) అన్నారు. ఓటర్ల మద్దతు ఉండటం వ్లలే వారికి సీట్లు ఇస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల (LokSabha Elections 2024) కోసం కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాష్ట్ర కేబినెట్‌లోని ఐదుగురు మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్లు కేటాయించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో సిద్ధరామయ్య ఆదివారం మైసూరులో జరిగిన ఒక కార్యక్రమంలో స్పందించారు.

‘‘రెండు రోజుల క్రితం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొందరు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులున్నారు. కేవలం మంత్రుల పిల్లలు, బంధువులు అనే కారణంతో వారికి సీట్లు కేటాయించలేదు. ప్రజాదరణ ఉండటం వల్ల అభ్యర్థులుగా పార్టీ వాళ్లని ఎంపిక చేసింది. రాష్ట్రంలో మేం అమలు చేసిన ఐదు గ్యారంటీ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. కాంగ్రెస్‌ పార్టీ 20 సీట్లలో విజయం సాధిస్తుంది’’ అని సిద్ధరామయ్య అన్నారు. 

కర్ణాటకలో ఇటీవల ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రామకృష్ణ పేరు కూడా ఉంది. ఆయన గుల్బర్గా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనతోపాటు మంత్రులు సతీశ్‌ జర్కిహోలీ కుమార్తె ప్రియాంక (చిక్కోడి), రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి (దక్షిణ బెంగళూరు), శివానంద పాటిల్‌ కుమార్తె సంయుక్త పాటిల్‌ (బగల్‌కోట్‌), లక్ష్మీ హెబ్బాల్కర్‌ కుమారుడు మృణాల్‌ (బెళగావి), ఈశ్వర్‌ ఖాంద్రే కుమారుడు సాగర్‌ (బీదర్‌), మల్లికార్జున భార్య ప్రభ (దావణగెరె), మాజీ రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌ రహమాన్‌ ఖాన్‌ కుమారుడు మన్సూర్‌ అలీ (బెంగళూరు సెంట్రల్‌)లకు కాంగ్రెస్‌ టికెట్లు కేటాయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని