Telangana: ముగిసిన ‘మండలి’ ప్రచారం

శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం శనివారంతో ముగిసింది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్ర నియోజకవర్గానికి సోమవారం పోలింగ్‌ జరగనుంది.

Published : 26 May 2024 04:20 IST

రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌
బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక
ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు

ఈనాడు, హైదరాబాద్‌: శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం శనివారంతో ముగిసింది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్ర నియోజకవర్గానికి సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 2న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నిక కోసం విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ప్రచార పర్వం ముగియటంతో పోలింగ్‌ ప్రక్రియపై పార్టీలు కసరత్తు చేపట్టాయి. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వారి కోసం 12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ప్రాధాన్య క్రమంలో ఓటు.. 

ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే వారి ఎడమ చేతి మధ్య వేలిపై సిరా గుర్తు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సాధారణంగా ఎడమ చేతి చూపుడు వేలిపై ఇండెలిబుల్‌ ఇంకు పూస్తారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎడమ చేతి చూపుడు వేలిపై వేసిన గుర్తు ఇంకా చెరిగిపోనందున మధ్య వేలిపై గుర్తు వేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు శనివారం ‘ఈనాడు’తో చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,448 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నిక నిర్వహించనున్నారు. అభ్యర్థులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉండటంతో ఈవీఎం యంత్రాలను ఉపయోగించటం లేదు. ఈ ఎన్నికలో నోటా గుర్తు ఉండదు. 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక్కో ఓటరు బరిలో ఉన్న ఎంత మందికైనా ప్రాధాన్య క్రమంలో అంకెల(న్యూమరిక్‌ నంబర్స్‌) ద్వారా ఓటు వేయవచ్చు. ఒకరికే లేదా ఎంత మంది అభ్యర్థులకైనా నంబర్ల ద్వారా ఓటు వేయవచ్చు. జూన్‌ 5న లెక్కింపు జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు