Sonia gandhi: నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ

రాహుల్‌ గాంధీకి మద్దతుగా సోనియాగాంధీ రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

Published : 18 May 2024 00:05 IST

లఖ్‌నవూ: తన కుమారుడు రాహుల్‌ గాంధీ(Rahul gandhi)ని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ(Sonia gandhi) అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ(Raebareli)లో రాహుల్‌కు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సోనియా తన కుమారున్ని ప్రజలకు అప్పగిస్తున్నానని, రాహుల్‌ వారిని ఎప్పటికీ నిరాశపరచరని పేర్కొన్నారు. 

ఎన్నో ఏళ్లుగా రాయ్‌బరేలీ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ ఈ ఏడాది ప్రారంభంలో రాజ్యసభకు వెళ్లారు. ఆమె స్థానం నుంచి ఈసారి ఎన్నికల బరిలో రాహుల్‌ నిల్చున్నారు.

సోనియా మాట్లాడుతూ ‘‘ఇందిరాగాంధీ, రాయ్‌బరేలీ ప్రజలు నాకు నేర్పిన పాఠాలే రాహుల్‌, ప్రియాంకలకు నేర్పించాను. బలహీనుల వైపు నిలబడమని, ప్రజల హక్కుల కోసం పోరాడమని వారికి చెబుతూ పెంచాను. 2004లో నేను తొలిసారి ఈస్థానం నుంచి పోటీ చేసినప్పటినుంచి ఇప్పటివరకు మీరు నాకు చాలా ప్రేమను ఇచ్చారు. చాలాకాలం తర్వాత మీ మధ్యకు వచ్చాను. 20 ఏళ్లు ఇక్కడినుంచి ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించారు. ఇది నా జీవితంలో అతిపెద్ద ఆస్తి. మీ అందరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు. రాయ్‌బరేలీ నా కుటుంబం, అమేఠీ(Amethi)  కూడా నా ఇల్లే. ఈ ప్రదేశంతో నాకు జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా కుటుంబం మూలాలు సైతం గత 100 ఏళ్లుగా ఈ నేలతో ముడిపడి ఉన్నాయి. మన బంధం గంగ అంత పవిత్రమైనది.’’అని అన్నారు.

రాయ్‌బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో ఉన్న రాహుల్‌కు ప్రత్యర్థిగా భాజపా అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌ పోటీ చేస్తున్నారు. అమేఠీలో భాజపా తరపున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ తరపున కిషోరీ లాల్ శర్మ తలపడనున్నారు. మే 20న లోక్‌సభ ఎన్నికల ఐదవ దశలో రాయ్‌బరేలీ, అమేఠీలలో పోలింగ్ జరగనుంది. 

అమేఠీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ‘‘నేను 42 సంవత్సరాల క్రితం మా నాన్న (రాజీవ్ గాంధీ)తో కలిసి ఇక్కడికి మొదటిసారి వచ్చాను.  రాజకీయాల గురించి ఏమైనా నేర్చుకున్నానంటే అది నాకు అమేఠీ ప్రజలే నేర్పారు. కాంగ్రెస్ తరపున కిషోరీ లాల్ శర్మ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి అతడికి ఓటు వేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నాను. నేను అమేఠీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నానని మీరు అనుకోకండి.. నేను ఇక్కడివాడిని ఎప్పటికీ ఇక్కడే ఉంటాను’’ అని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని