Maneka Gandhi: భాజపాలో ఉన్నందుకు సంతోషంగా ఉంది: మేనకా గాంధీ

తాను భాజపాలో ఉన్నందుకు సంతోషంగా ఉందని మేనకా గాంధీ తెలిపారు. ఆమె సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 

Published : 02 Apr 2024 12:54 IST

సుల్తాన్‌పూర్: సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను భాజపా తనకు కేటాయించడంపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. వరుణ్‌గాంధీకి ఫీలీభీత్‌ టికెట్‌ను పార్టీ నిరాకరించడంపై చర్చ జరుగుతున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భాజపా చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకా గాంధీ (Maneka Gandhi) తాను పోటీ చేస్తున్న సుల్తాన్‌పూర్‌(యూపీ)లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను భాజపాలో కొనసాగడం సంతోషంగా ఉందని తెలిపారు. ‘‘ నాకు టికెట్‌ ఇవ్వడంలో చాలా జాప్యం జరిగింది. దీంతో సుల్తాన్‌పూర్‌, ఫీలీభీత్‌లో ఎక్కడి నుంచి బరిలోకి దిగాలన్న అంశంపై గందరగోళంలో ఉన్నాను. కానీ, ఆ తర్వాత పార్టీ తీసుకొన్న నిర్ణయానికి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిచినవారు మళ్లీ విజయం సాధించరని చరిత్ర చెబుతోందన్నారు.

మేనకా గాంధీ కుమారుడు వరుణ్‌గాంధీకి ఫీలీభీత్‌ టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడంపై మేనక తొలిసారి స్పందించారు. ప్రస్తుతం అతడు ఏమి చేయాలనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నించగా.. ‘‘వరుణ్‌ గాంధీనే ఇది అడగండి. లోక్‌ సభ ఎన్నికల అనంతరం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా సమయం ఉంది’’అని తెలిపారు.  

టికెట్‌ లభించిన తర్వాత మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో నియోజకవర్గంలోని 101 గ్రామాలను ఆమె సందర్శించనున్నారు.

మరోవైపు ఇటీవల వరుణ్‌ గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగపూరితమైన లేఖ రాశారు. చివరి క్షణం వరకు ఫీలీభీత్‌ ప్రజలకు అండగా ఉంటానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని