Harish rao: టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై విషం చిమ్మడం బాధాకరం: హరీశ్‌రావు

భారాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

Updated : 24 May 2024 15:10 IST

హైదరాబాద్‌: భారాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘‘జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేసింది. 5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. లేని పోని ఆరోపణలు చేస్తోంది. టిమ్స్ ఆస్పత్రుల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరం.

టిమ్స్ ఎల్బీనగర్ ఆస్పత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే.. 27 అంతస్తులు అని మాట్లాడడం మంత్రి కోమటిరెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని మొసలి కన్నీరు కార్చుతున్న మంత్రికి.. జైపుర్‌లో 2022 ఏప్రిల్ 5న నాటి రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆస్పత్రి ఎందుకు కనిపించడం లేదు? ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ దేశ రాజధానిలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆస్పత్రి కనిపించడం లేదా..? నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలి. అంతే గానీ చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని సూచిస్తున్నా’’ అని హరీశ్‌ రావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు