Harish Rao: దొడ్డు వడ్లకు బోనస్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ నయవంచన

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటనలో విమర్శించారు. కేవలం సన్న రకం వడ్లకే రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి.. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా నయవంచనకు పాల్పడిందన్నారు.

Published : 21 May 2024 04:30 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటనలో విమర్శించారు. కేవలం సన్న రకం వడ్లకే రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి.. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా నయవంచనకు పాల్పడిందన్నారు. ‘‘రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారు. పది శాతం పండే సన్న రకం వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. వాటికి మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్లో ధర వస్తుంది. దొడ్డు రకానికే గిట్టుబాటు ధర రాదు. బోనస్‌ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకే. అలా కాకుండా సన్న రకాలకే బోనస్‌ ఇస్తామనడం, అదీ వచ్చే సీజన్‌ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమే. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ సీజన్‌ నుంచే అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వహణకు నిధులను, సిబ్బంది పెండింగ్‌ జీతాలను ప్రభుత్వం చెల్లించాలన్నారు. కిర్గిజ్‌స్థాన్‌లో ఉన్న తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని.. ముఖ్యమంత్రి కార్యాలయానికి, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు, బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయానికి హరీశ్‌రావు ‘ఎక్స్‌’ వేదికగా విన్నవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని