మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి

ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని హరియాణా మంత్రి కన్వర్‌పాల్‌ అన్నారు.

Published : 15 May 2024 21:29 IST

చండీగఢ్‌: తమ ప్రభుత్వం ప్రమాదంలో లేదని హరియాణా మంత్రి కన్వర్‌ పాల్‌ అన్నారు. బలపరీక్షకు గవర్నర్‌ ఆదేశిస్తే అసెంబ్లీలో తమ మెజార్టీని నిరూపించుకుంటామని చెప్పారు. మార్చిలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్థానంలో కొత్త సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీని నియమించిన సమయంలో భాజపా ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవల జేజేపీ-భాజపా బంధం తెగిపోవడం, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలతో భాజపా ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీనిపై మంత్రి కన్వర్‌ పాల్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. గవర్నర్‌ ఆదేశిస్తే తమ మెజార్టీని నిరూపించుకుంటామన్నారు.

ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం ఎక్కడి నుంచి తెస్తారని మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. ‘‘ప్రతిదీ ఇక్కడ వెల్లడించలేం. కానీ, సభలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలతోనే మా బలాన్ని నిరూపించుకుంటాం’’ అని సమాధానమిచ్చారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికార భాజపా (BJP) ప్రభుత్వం మెజార్టీ కోల్పోవడంతో..  తక్షణమే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాంగ్రెస్‌, జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీలు గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసి.. మైనార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ కోరుతున్నాయి. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల సంఖ్య (మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, మరో స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్‌ చౌటాలా రాజీనామాలతో) 88కు పడిపోయింది. ఇందులో భాజపాకు 40 మంది సభ్యుల బలం ఉంది. ఇద్దరు స్వతంత్ర శాసనసభ్యులు, హరియాణా లోక్‌హిత పార్టీ ఏకైక సభ్యుడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అయినప్పటికీ మెజార్టీకి ఇంకా ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం.

మరోవైపు, జేజేపీ-భాజపా మధ్య సంబంధాలు తెగిపోయినప్పటికీ ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారంటూ భాజపా నేతలు చెబుతున్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖరాయడంపై స్పందించిన మంత్రి కన్వర్‌ పాల్‌.. వారి లేఖల్ని గవర్నర్‌ ఆమోదించలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని