Chandrababu: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

Updated : 09 Oct 2023 14:17 IST

దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. 

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 3న దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు మళ్లీ వాదనలు కొనసాగాయి.

చంద్రబాబు తరఫున హరీశ్‌ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ‘‘సెప్టెంబర్‌ 19న హైకోర్టు తీర్పు రిజర్వు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 20న కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచింది. 19న వాదనలు పూర్తయి తీర్పు వాయిదావేశాక 20న వాటిని కోర్టు ముందు పెట్టింది. 2018లో నేరం జరిగిందన్న వివరాలేవీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనలేదు. 2021లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే రిమాండ్‌ రిపోర్టు ఉంది. దాని ఆధారంగా మేం చెప్పదలచుకుంది 17ఏ వర్తిస్తుందనే. 1959 ఎస్‌ఈఆర్‌ 191 కేసు జడ్జిమెంట్‌ ప్రకారం చట్టసవరణకు ముందు కేసులకు కూడా వర్తిస్తుంది’’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

రిమాండ్‌ ఆర్డర్‌నే ఛాలెంజ్‌ చేస్తున్నాం: హరీశ్‌ సాల్వే

2018లోనే విచారణ ప్రారంభమైందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ చేసిన వాదనలను ఈ సందర్భంగా జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ప్రస్తావించారు. అనంతరం హరీశ్‌ సాల్వే వాదిస్తూ రోహత్గీ వాదనే సహేతుకం కాదని.. ఎఫ్‌ఐఆర్‌కు దారితీసిన విచారణ అదికాదని చెప్పారు. గతంలో ఏదో విచారణ జరిగిందని.. దాన్ని మూసేశారని చెప్పారు. ఆ తర్వాత కొత్త విచారణ ప్రారంభించారని తెలిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి? హైకోర్టు వాటిని పరిశీలించిందా? అని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ప్రశ్నించగా.. అసలు సమస్యంతా అక్కడే ప్రారంభమైందని సాల్వే చెప్పారు. ‘‘2018 విచారణకు సంబంధించిన ఏ డాక్యుమెంట్లనూ ప్రస్తావించలేదు. రిమాండ్‌ విధించిన కోర్టు ముందు దానికి సంబంధించిన పత్రాలేవీ లేవు. పత్రాలేవీ సమర్పించకపోయినా రిమాండ్‌ కోర్టు 2018కి ముందు నేరం జరిగినట్లు రికార్డు చేసింది’’ అని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్‌ బేలా ఎం.త్రివేది స్పందిస్తూ రిమాండ్‌ ఆర్డర్‌నే ఛాలెంజ్‌ చేస్తున్నారా? అని ప్రశ్నించగా.. అవును రిమాండ్‌ ఆర్డర్‌నే ఛాలెంజ్‌ చేస్తున్నామని బెంచ్‌కు హరీశ్‌ సాల్వే నివేదించారు. అనంతరం విచారణను సుప్రీంకోర్టు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. భోజన విరామం అనంతరం వాదనలు తిరిగి ప్రారంభం అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని