హిమాచల్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌.. కలకలం రేపుతున్న ప్రతిభాసింగ్ వ్యాఖ్యలు

ప్రస్తుత పరిణామాలతో  హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ సర్కార్‌కు గండం తొలగిపోలేదనే చర్చ నడుస్తోంది. 

Published : 01 Mar 2024 15:53 IST

శిమ్లా: హమ్మయ్య.. బతికి బయటపడ్డాం..! అని హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) కాంగ్రెస్‌(Congress) సర్కార్‌ అనుకునేలోపే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ప్రతిభాసింగ్(Pratibha Singh) చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను మరోసారి వేడెక్కించాయి. ఎమ్మెల్యేలతో ఏకాంత చర్చలు జరిపామని, విభేదాలు సమసిపోయాయని పార్టీ పరిశీలకుడిగా వచ్చిన డీకే శివకుమార్‌ ప్రకటించిన మరుసటిరోజే ఆమె స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

‘కాంగ్రెస్‌లో చేయాల్సినవి చాలా ఉన్నాయి.  పార్టీని పటిష్ఠం చేస్తేనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమని మొదటిరోజు నుంచి సీఎంకు చెబుతున్నాను. క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మాకంటే భాజపా మెరుగైన పనితీరు చూపుతోందన్నది వాస్తవం. ప్రధాని మోదీ సూచనలతో ఆ పార్టీ చురుగ్గా పని చేస్తోంది. కానీ మేం బలహీనంగా ఉన్నాం. ఇది క్లిష్ట సమయం. అయినప్పటికీ, మేం ఎన్నికల్లో పోటీ పడాలి. ఇక, క్రాస్‌ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో..?’ అని ఆమె మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలోని ఒక స్థానానికి మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగుకు పాల్పడటంతో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తర్వాత వారిపై అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌సింగ్‌ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిని వెనక్కి తీసుకోవాలని ప్రతిభాసింగ్ కుమారుడు, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ సీఎంను కోరారు. ‘వారు తమ తప్పును అంగీకరించారు. వారిపై వేటును పునఃపరిశీలిద్దాం’ అని అన్నారు. అలాగే ఆయన హరియాణాలోని పంచకుల హోటల్‌లో ఉన్న రెబల్‌ ఎమ్మెల్యేలను కలిసినట్లు సమాచారం. కొద్ది గంటల పాటు వారితో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే తన భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకునేముందు ఒకసారి దిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే..  సుఖు ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడదని ప్రతిపక్ష భాజపా నేత జైరాం ఠాకుర్‌ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని విమర్శించారు. మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ బిల్లు ఆమోదం కోసమే 15 మంది భాజపా ఎమ్మెల్యేలను సస్పెండు చేసిందన్నారు. రాజ్యసభ ఎన్నికలో అనూహ్య ఓటమితో కాంగ్రెస్‌ ప్రజల విశ్వాసం కోల్పోయిందని హిమాచల్‌ప్రదేశ్‌ భాజపా చీఫ్‌ రాజీవ్‌ బిందల్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు