Lok Sabha Elections: అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్‌’ డిప్యూటీ సీఎం కుమార్తె

ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్‌పుర్‌ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.

Published : 19 Apr 2024 00:15 IST

హమీర్‌పుర్‌: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్‌ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి నిరాకరించారు. తన తల్లి ఫిబ్రవరిలో మృతి చెందడంతో ఎన్నికలకు  దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. హిమాచల్‌లోని హమీర్‌పుర్‌ సీటు నుంచి ఆస్తాను బరిలోకి దించాలని కాంగ్రెస్‌ యోచిస్తున్న తరుణంలో ఆమె ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు కేంద్రమంత్రి, భాజపా సీనియర్‌ నేత అనురాగ్‌ ఠాకూర్‌ ఇదే సీటు నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా ఆస్తా అగ్నిహోత్రిని పోటీలోకి దించాలని కాంగ్రెస్‌ యోచిస్తున్న వేళ ఇటీవల తన తల్లి ప్రొఫెసర్‌ సిమ్మి అగ్నిహోత్రి మరణాన్ని పేర్కొంటూ పోటీకి విముఖత వ్యక్తంచేయడం గమనార్హం. 

ఇదే విషయాన్ని ప్రకటిస్తూ ఆస్తా ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పోస్టు పెట్టారు.  తన తల్లి మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని.. ఆమె లేని తన జీవితానికి కొత్త మార్గాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి విషాద సమయంలో లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదంటూ మీడియాతో మాట్లాడిన ఓ వీడియోను ఆమె షేర్ చేశారు. తల్లి జ్ఞాపకాలే తనలో మెదలుతున్నాయని.. ఆమెకు నివాళులర్పించాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి, తనను బరిలో దించాలని ప్రతిపాదన చేసిన ప్రతీఒక్కరికీ ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం ముకేశ్‌ అగ్నిహోత్రి సతీమణి సిమ్మి అగ్నిహోత్రి (56) ఫిబ్రవరి 9న గుండెపోటుతో మృతి చెందారు.

మరోవైపు, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలకు జూన్‌ 1న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులుగా మండి లోక్‌సభ స్థానానికి మంత్రి విక్రమాదిత్య సింగ్‌, షిమ్లా నుంచి కసౌలి ఎమ్మెల్యే వినోద్‌ సుల్తాన్‌పురి బరిలో ఉండగా.. కాంగ్రా, హమీర్‌పుర్‌ సీట్లను మాజీ మంత్రి ఆశా కుమారి, మాజీ ఎమ్మెల్యే సత్పాల్‌ రైజదాలు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని