Himachal Pradesh: క్రాస్‌ఓటింగ్‌ ఎఫెక్ట్‌.. హిమాచల్‌ సీఎంపై ‘అవిశ్వాస’ అస్త్రం..!

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. సీఎంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష భాజపా సిద్ధమవుతోంది.

Updated : 28 Feb 2024 11:45 IST

శిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha Elections) జరిగిన క్రాస్‌ ఓటింగ్‌తో హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో రాజకీయ సంక్షోభం నెలకొంది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో అధికార కాంగ్రెస్‌ (Congress)కు సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీకి ఓటేయ్యడంతో హస్తం పార్టీ అభ్యర్థి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు (Sukhvinder Singh Sukhu)ను గద్దె దింపేందుకు భాజపా (BJP) ‘అవిశ్వాస’ అస్త్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌ తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

మాజీ సీఎం జైరాం ఠాకుర్‌ నేతృత్వంలోని భాజపా శాసనసభా పక్షం బుధవారం రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను కలిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. దీనిపై భాజపా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. అసెంబ్లీ వ్యవహారాలపై ఫిర్యాదు చేసేందుకే గవర్నర్‌ను కలిసినట్లు తెలిపారు.

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

మరోవైపు, హిమాచల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన హర్ష్‌ మహాజన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం సుఖ్విందర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

అజ్ఞాతంలోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..

ఇదిలా ఉండగా.. రాజ్యసభలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన రెబల్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఉదయం వారు ప్రత్యేక చాపర్‌లో పంచకులను వీడి రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీఎం సుఖ్విందర్‌పై రెబల్స్‌ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారని, ముఖ్యమంత్రిని మార్చాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్‌ను విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అధిష్ఠానం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతోనే వారు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం.

భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌..

రాష్ట్రంలో నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే భాజపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో 15 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్‌ చేశారు. వీరిలో శాసనసభ ప్రతిపక్ష నేత జైరాం ఠాకుర్‌ కూడా ఉన్నారు. అనుచిత ప్రవర్తన కారణంగానే వారిని సస్పెండ్ చేసినట్లు సభాపతి తెలిపారు. అనంతరం సభను వాయిదా వేశారు.

68 సభ్యులున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40, భాజపాకు 25 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో ముగ్గురు స్వతంత్రులు. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు భాజపాకు ఓటేశారు. దీంతో కాంగ్రెస్‌, భాజపాలకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీశారు. అందులో భాజపాకు చెందిన హర్ష్‌ మహాజన్‌ను అదృష్టం వరించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ పరాజయం పాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని