అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక

దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరికలు జారీచేశారు. తనపై కేసులు ఉన్నాయని మరోసారి అంటే మరుసటిరోజే పరువు నష్టం దావా వేస్తానన్నారు.

Published : 01 Apr 2023 01:36 IST

గువాహటి: దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం అస్సాం పర్యటనకు వెళ్లనున్న వేళ  ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనను మరోసారి అవినీతిపరుడు అని అంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.  దేశంలోని ఏ కోర్టుల్లో గానీ, ఏజెన్సీల వద్ద గానీ తనపై ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. ‘‘నాపై ఏం కేసు ఉంది? ఎక్కడ ఉంది? ఒక్క కేసు ఉన్నా చూపించాలని కేజ్రీవాల్‌కు సవాల్‌ చేస్తున్నా’’ అని విలేకర్ల వద్ద వ్యాఖ్యానించారు.  

తనను అవినీతి పరుడని పేర్కొంటూ సీఎం కేజ్రీవాల్‌ గతంలో ఆరోపణలు చేయగా. . ఆయన దిల్లీ అసెంబ్లీ లోపల మాట్లాడినందున తాను పరువు నష్టంకేసు వేయలేకపోయానని హిమంత అన్నారు.  ‘‘నేను పరువు నష్టం దావా వేద్దామనుకున్నా. కానీ కేజ్రీవాల్‌ పిరికివాడిలా  నా గురించి అసెంబ్లీలోపల మాట్లాడారు. నేను ఛాలెంజ్‌ చేస్తున్నా.. ఈ నెల 2న అస్సాం పర్యటనకు వచ్చినప్పుడు నాపై కేసు ఉంది అని అనమనండి చూద్దాం.  సిసోదియాపై వేసినట్టుగా ఆ మరుసటి రోజే కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా పెడతా’’ అని హెచ్చరించారు. అస్సాంలో ఆప్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో ఆదివారం అర్వింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని