india alliance: ఇండియా అలయన్స్‌ పుంజుకుందిలా..!

ఇండియా కూటమి ఈసారి అంచనాలకు మించి పుంజుకొంది. ఇది భాజపాకు ఓ రకంగా షాక్‌. ఫలితంగా ఆ పార్టీ మ్యాజిక్‌ మార్కును అందుకోలేకపోయింది. కూటమి సర్వశక్తులు ఒడ్డి ఓ వ్యూహం ప్రకారం ముందుకువెళ్లడంతో ఫలితాలు మెరుగుపడ్డాయని చెప్పాలి. 

Updated : 04 Jun 2024 21:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హిందీ బెల్ట్‌లో బలంగా ఉన్న భాజపాను ఎదుర్కోవాలంటే బలమైన కూటమి అవసరాన్ని ప్రతిపక్షాలు ఏడాది క్రితమే గుర్తించాయి. దీంతో గతేడాది జూన్‌లో తొలిసారి ఓ వేదికపై కలిసిన ఈ పార్టీలు యూపీఏ పేరిట కాకుండా.. ఇండియా కూటమి (india alliance)గా ఏర్పడ్డాయి. తమిళనాడులో డీఎంకేకు ఎదురులేకపోవడం.. కేరళలో భాజపా అత్యంత బలహీనంగా ఉండటంతో .. యూపీలో కమలదళానికి కళ్లెం వేయడంపై దృష్టిపెట్టాయి. భాజపాను నిలువరించేందుకు ఒక్క సీటు ఇవ్వకపోయినా పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ నాయకులు ఒక దశలో వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లో సామాజిక సమీకరణలు..

ఉత్తరప్రదేశ్‌లో ఈసారి ఇండియా కూటమి ఏకంగా 45 స్థానాలతో మెజార్టీ సీట్లను దక్కించుకొంది. ఈ దెబ్బ మొతం ఎన్డీఏ కూటమిపైనే పడింది. యాదవ పార్టీగా ముద్ర పడిన సమాజ్‌వాదీ దాని నుంచి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నించింది. 64 చోట్ల టికెట్ల పంపిణీలో కేవలం ఐదుగురు మాత్రమే ఆ కులస్తులకు టికెట్లు ఇచ్చింది. మిగిలిన 27 యాదవేతర ఓబీసీలకు, 11 స్థానాల్లో అగ్రవర్ణాలు, ముస్లింలకు నాలుగు, ఖత్రీలకు ఒకటి కేటాయించింది. 15 మంది దళితులు ఉన్నారు. మరోవైపు భాజపా పోటీ చేసిన 75 సీట్లలో 34 అగ్రవర్ణాలకు కేటాయించింది. ఇక 25 ఓబీసీలకు ఇచ్చింది.  

యూపీలో విభిన్నమైన ప్రచార శైలి..

ఇరుపక్షాల ప్రచారశైలిలు భిన్నంగా ఉన్నాయి. ఎన్‌డీఏ కూటమి భారీ ర్యాలీలు ఆర్భాటానికి ప్రాధాన్యమిస్తే.. ఇండియా అలయన్స్‌ హడావుడికి దూరంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు, సంఘాలతో కలిసి ప్రచారం చేసింది. మరోవైపు ప్రియాంకాగాంధీ కూడా అమేఠీ, రాయబరేలీ నగరాల్లో స్ట్రీట్‌ కార్నర్‌ సభలను నిర్వహించింది. ఫలితంగా పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాల్లో సమాజ్‌వాదీ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. చివరికి గతంలో భాజపా బలంగా ఉన్న బూందేల్‌ ఖండ్‌లో విజయాలు నమోదు చేసింది. 

ఉల్లి సమస్య దెబ్బ కొట్టిందా..

ఇండియా కూటమి బలంగా ఎదిగిన ప్రాంతాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉల్లిపాయ పంట ప్రధాన ఆదాయవనరు. దీనిని ఆనియన్‌ బెల్ట్‌ అంటారు. గతంలో ఈ స్థానాలు మొత్తంలో ఏకపక్షంగా ఎన్‌డీఏకు దక్కాయి . కానీ, ఈసారి వీటిల్లో ఏడు సీట్లు ఇండియా అలయన్స్‌ పక్షానికి మొగ్గాయి. 2023 నుంచి కేంద్రం ఉల్లి ఎగుమతుల పాలసీల్లో తరచూ మార్పులు చేస్తుండటంతో రైతులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఫలితంగా ఇక్కడ ఎగుమతుల్లో అత్యంత కీలకమైన దిందోరీ సీటు శరద్‌పవార్‌ పార్టీ పక్షానికి మొగ్గగా.. ఇక నాసిక్‌ సీటు శివసేన ఉద్ధవ్‌ వర్గానికి వెళ్లింది. మరోవైపు శివసేన, ఎన్సీపీని చీల్చడాన్ని మహారాష్ట్ర ఓటర్లలోకి కూటమి బలంగా తీసుకెళ్లింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న శరద్‌పవార్‌పై భాజపా ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకు సానుభూతిని తీసుకొచ్చాయి. 

పార్టీలో చేరికలపై ప్రజల్లోకి వెళ్లి..

ప్రతిపక్ష పార్టీ నేతలను అధికార పక్షం ఆకర్షించడాన్ని ఇండియా కూటమి బలంగానే ప్రచారం చేసింది. ముఖ్యంగా ఆదర్శ్‌ కుంభకోణంలో ఉన్న అశోక్‌ చవాన్‌ వంటివారిని కూడా చేర్చుకోవడంతో భాజపా చెడ్డపేరు తెచ్చుకొంది. ఇక ఆప్‌ ‘వాషింగ్‌ మిషిన్‌ బ్లాక్‌ మ్యాజిక్‌’ పేరిట ప్రచారం కూడా ప్రారంభించింది. దాదాపు 100 మందికిపైగా ప్రతిపక్ష నేతలను చేర్చుకోవడం ఇండియా కూటమికి ప్రచార ఆయుధంగా మారింది.  

ఇండియా కూటమి ధరలు, నిరుద్యోగం, రిజర్వేషన్లు..

ఈ ఎన్నికల్లో ప్రచారానికి ఇండియా అలయన్స్‌ నిర్దిష్టమైన అంశాలను ఎంచుకొంది. అధికార పక్షంపై విమర్శలు చేస్తూనే.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను బలంగా ప్రచారం చేసింది. మరోవైపు 2019లో జాతీయ భద్రత వలే ఈసారి భాజపా వద్ద కచ్చితమైన ప్రధాన ప్రచారాస్త్రం ఏమీ లేదు. దీంతో కమలదళ ఎన్నికల పోరు కొంచెం గాడి తప్పింది. మంగళ సూత్రాలు, తిరిగే ఆత్మ (శరద్‌పవార్‌), ఓబీసీ రిజర్వేషన్లలో కోత వంటి అంశాలను ఏకంగా ప్రధాని ప్రస్తావించడం చేటు చేశాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో మైనార్టీల్లోని కొన్ని వర్గాలు యూపీలో భాజపాకు అండగా నిలిచాయి. కానీ, తాజా వ్యాఖ్యలు వారిని ఆ పార్టీకి దూరం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు