Nara Lokesh: లోకేశ్‌ పాదయాత్ర... తెదేపా విజయయాత్ర..!

రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో తెదేపా అసాధారణ విజయానికి దోహదం చేసిన ప్రధాన అంశాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కీలకమైంది.

Updated : 05 Jun 2024 07:48 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో తెదేపా అసాధారణ విజయానికి దోహదం చేసిన ప్రధాన అంశాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కీలకమైంది. వైకాపా అరాచకాలను ఎండగట్టడం, తెదేపాను మరింతగా ప్రజలకు చేరువ చేయడం, పార్టీలో యువనాయకత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభించిన లోకేశ్‌ పాదయాత్రకు విశేషమైన స్పందన లభించింది. 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జరిగిన యాత్రలో లోకేశ్‌ 3,132 కి.మీ.లు నడిచారు. 2004, 2014, 2019 ఎన్నికలకు ముందు వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, జగన్‌ చేసిన పాదయాత్రలకు... అప్పటి ప్రభుత్వాల నుంచి ఎలాంటి అడ్డంకులూ ఎదురవలేదు. అప్పటి పాలకులు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ నేతల పాదయాత్రలు సాఫీగా జరిగేలా చూశారు.

ఎన్నికల్లో గెలిచిన అనంతరం తల్లి భువనేశ్వరితో కలిసి సంబరాల్లో లోకేశ్‌

కానీ ‘యువగళం’ పాదయాత్రను అడ్డుకునేందుకు జగన్‌ ప్రభుత్వం తొలి రోజు నుంచీ విశ్వప్రయత్నాలు చేసింది. పోలీసులను ప్రయోగించి, అడుగడుగునా అక్రమ కేసులు పెట్టింది. జీవో నం.1 చూపించి అవరోధాలు సృష్టించింది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం చేరేంతవరకు పోలీసులు మొత్తం 25 పోలీసు కేసులు నమోదు చేయగా, వాటిలో మూడు లోకేశ్‌పై నమోదయ్యాయి. పీలేరులో బాణాసంచా కాల్చారని... అక్కడి ఇన్‌ఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సహా పలువురిపై కేసులు పెట్టారు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు వంటి చోట్ల వైకాపా నాయకులు, పోలీసులు కుమ్మక్కై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. 40 మంది యువగళం వాలంటీర్లపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైలుకి పంపారు. గన్నవరం నియోజకవర్గంలో 46 మందిపై తప్పుడు కేసులుపెట్టారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని, వారికి దీటుగా సమాధానం చెబుతూ లోకేశ్‌ పాదయాత్రను విజయవంతంగా కొనసాగించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో కొన్ని రోజులు విరామం ఇచ్చి, మళ్లీ పాదయాత్ర కొనసాగించారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర ముగిసిన... విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్దే లోకేశ్‌ కూడా పాదయాత్ర ముగించారు. విజయనగరం జిల్లాలోని పోలిపల్లి వద్ద భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెదేపా జయకేతనం ఎగరేయడానికి లోకేశ్‌ పాదయాత్ర ఎంతో దోహదం చేసింది. 

రాటుతేలిన యువనేత!

రాజకీయాల్లో మరింత రాటుదేలేందుకు, పరిణితి కలిగిన ప్రజా నాయకుడిగా ఎదిగేందుకు యువగళం పాదయాత్ర లోకేశ్‌కు ఎంతో తోడ్పడింది. ప్రజల సమస్యల్ని స్వయంగా చూసేందుకు, వారి ఆశల్ని, ఆకాంక్షల్ని ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకునేందుకు వేదికగా నిలిచింది. నెలలతరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్‌ను నాయకుడిగా మరింత రాటుదేల్చాయి. పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో లోకేశ్‌ను లక్షలాది మంది కలసి సమస్యలు విన్నవించారు. తీవ్రమైన ఆరిక ఇబ్బందుల్లో ఉన్నవారు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు వారిని ఊరడించి.. సమస్య తీవ్రతను బట్టి ప్రతి జిల్లాలో కొందరికి వ్యక్తిగతంగా సాయమందించారు. ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఆ ప్రాంతానికి ఒక వరం ప్రకటిస్తూ ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేస్తామని ప్రకటించారు.

రచ్చబండ, అపార్టుమెంట్లలో భేటీలు

ఎన్నికల ప్రచారంలోనూ లోకేశ్‌ తనదైన పంథాలో వ్యవహరించారు. నేరుగా ప్రజలను కలిసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉదయం పూట మంగళగిరి, తాడేపల్లిలో అపార్టుమెంటు వాసులతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో తాను ఏం చేయబోయేదీ స్పష్టంగా వివరించారు. సాయంత్రం పూట రచ్చబండ పేరుతో పల్లెవాసులతో సమావేశమై ప్రజలతో మమేకమయ్యారు. ఇది ప్రజలను బాగా ఆకట్టుకుంది. లోకేశ్‌ను ఓడించేందుకు జగన్‌ కంకణం కట్టుకుని పనిచేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాకుండా.. నియోజకవర్గంలో బలమైన చేనేతవర్గానికి చెందిన చిరంజీవికి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతను అప్పజెప్పారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి మంగళగిరిపై ప్రత్యేకదృష్టి సారించి నేతలు, కార్యకర్తలతో నిత్యం సమావేశాలు నిర్వహించారు. అయినా సానుకూలత రావడం లేదని... చిరంజీవిని తప్పించి మురుగుడు లావణ్యకు టికెట్‌ ఇచ్చారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు.


పాదయాత్రలు... ఫలితాలు!

వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి: 2003లో ఏప్రిల్‌ 9న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వై.ఎస్‌. పాదయాత్ర ప్రారంభించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ఆయన ‘ప్రజాప్రస్థానం’ పేరుతో ఈ యాత్ర చేశారు. చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు 90 రోజులపాటు 1,475 కి.మీ.లు నడిచారు. 2004 ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్‌ 157 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 


వై.ఎస్‌.షర్మిల: జగన్‌ జైల్లో ఉండగా... వైకాపా బాధ్యతను భుజాన వేసుకున్న షర్మిల 2012 అక్టోబరు 18న కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 2103 ఆగస్టు 4న ఇచ్ఛాపురంలో ముగిసింది. ఆమె సుమారు 3 వేల కి.మీ.లు నడిచారు. కానీ ఆమె శ్రమకు ఫలితం రాలేదు. ఈ పాదయాత్ర 2014 ఎన్నికల్లో వైకాపాను అధికారంలోకి తేలేకపోయింది. 


చంద్రబాబు: తెదేపా అధినేత చంద్రబాబు 2012 అక్టోబరు 2న అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ‘వస్తున్నా మీకోసం’ పేరుతో నిర్వహించిన పాదయాత్ర 208 రోజులపాటు కొనసాగింది. 2,817 కి.మీ.లు నడిచారు. విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద పాదయాత్ర ముగిసింది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో తెదేపా, భాజపా కలసి పోటీ చేయగా, జనసేన మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో తెదేపా 102, భాజపా 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చాయి. ఆ ఎన్నికల్లో తెదేపా విజయానికి చంద్రబాబు పాదయాత్ర దోహదం చేసింది.   


జగన్‌: జగన్‌ ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగించారు. మొత్తం 341 రోజులపాటు 3,648 కి.మీ.లు నడిచారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లో కోర్టుకి హాజరయ్యేందుకు ఆయన పాదయాత్రకు విరామం ఇచ్చేవారు. ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ జగన్‌ ప్రజలకు చేరువయ్యేందుకు ఆ పాదయాత్ర బాగా ఉపయోగపడింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకుని జగన్‌ అధికారంలోకి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు