Pawan Kalyan: రాజకీయాల్లోనూ ‘పవర్‌’ స్టార్‌!

సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్‌కల్యాణ్‌ ‘పవర్‌’స్టార్‌గా నిలిచారు. అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్‌ మాదిరి... ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వాళ్లే రాజకీయాల్లో హీరో అని నిరూపించారు.

Published : 05 Jun 2024 07:29 IST

తగ్గి నెగ్గిన పవన్‌కల్యాణ్‌ 
బలాలు, బలహీనతలపై స్పష్టమైన అంచనా
ఆవేశం ఎంతో ఓర్పూ అంతే 
ప్రజారాజ్యాన్ని మించిన విజయం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి విజయవాడకు బయలుదేరే ముందు పవన్‌ కల్యాణ్‌కు హారతి ఇస్తున్న ఆయన భార్య అన్నా. చిత్రంలో పవన్‌ కుమారుడు అకీరా నందన్‌

ఈనాడు-అమరావతి: సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్‌కల్యాణ్‌ ‘పవర్‌’స్టార్‌గా నిలిచారు. అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్‌ మాదిరి... ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వాళ్లే రాజకీయాల్లో హీరో అని నిరూపించారు. అవసరమైనప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించినా అంతే మొత్తంలో ఓర్పును ప్రదర్శిస్తూ రెండింటినీ సమన్వయం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ యవనికపై ఒక తారలా వెలుగొందారు. అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నా జగన్‌ ప్రభుత్వం దురంహకారంతో వ్యవహరించినా తెలివైన ఎత్తుగడలతో దీటుగా ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజ్యం సాధించిన 18 స్థానాల కన్నా అధిక సీట్లు గెలుచుకుని జనం మనసుల్లోనూ రాజకీయస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తొలిసారి తన పరివారంతో శాసనసభలో అడుగుపెడుతున్నారు.

కామన్‌మ్యాన్‌ బంధువు

2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ కార్యకలాపాల్లోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ 18 స్థానాలు గెలుపొందింది. ఆ తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి పరిస్థితులతో సంఘర్షణ పడ్డ పవన్‌కల్యాణ్‌ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన అన్నయ్య చిరంజీవికి ఇష్టం లేకపోయినా తిరిగి జనసేన పేరుతో పార్టీని ప్రారంభించి 2014 ఎన్నికల్లోనే భాజపా, తెలుగుదేశం పార్టీలకు మద్దతు పలికారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా.. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అనుభవజ్ఞుడైన పాలకుడు చంద్రబాబు అవసరాన్ని గుర్తించి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో ఈ పార్టీల విజయానికి ప్రచారమూ చేశారు. నాడు ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటయ్యేందుకు తన వంతు పాత్ర పోషించారు. 2019 ఎన్నికల నాటికి ఆయన తెదేపా, భాజపాలను వీడి బయటకు వచ్చారు. కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆ ఎన్నికల్లో 160కు పైగా స్థానాల్లో జనసేన పోటీ చేసింది. పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాలు రెండింటిలోనూ ఓడిపోయారు. ఈ ఓటమిని సైతం తట్టుకొని కొద్ది రోజుల్లోనే మళ్లీ పోరాటం ప్రారంభించి ఈ స్థాయి విజయాన్ని సాధించారు. కామన్‌మ్యాన్‌ ఆలోచనకు తగ్గట్లుగా తాను నడుచుకుంటానని చెప్పే పవన్‌కల్యాణ్‌ జనం నాడి పట్టుకోవడంలో సఫలమయ్యారు.

తొలుత భాజపాతో పొత్తు

రాజకీయంగా అడుగులు వేయడంలో పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. భవిష్యత్తు ముఖచిత్రాన్ని ముందే అంచనా వేసిన ఆయన 2020 జనవరిలోనే భాజపాతో పొత్తు ప్రకటించారు. దిల్లీ వెళ్లి భాజపా పెద్దలతో మాట్లాడి వచ్చిన పవన్‌.. సంక్రాంతి పండుగ రోజుల్లోనే తాను భాజపాతో బేషరతుగా పొత్తు పెట్టుకుంటున్నట్లు విజయవాడలో ప్రకటించారు. పవన్‌కల్యాణ్‌ అభిమాన గణం, యువతీ యువకులు ఆయనకు అనునిత్యం అండగా నిలిచారు. ఒక వైపు పార్టీ క్రియాశీల సభ్యత్వం పెంచుకోవడం, పార్టీ శిక్షణ కార్యక్రమాలు.. మరోవైపు ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక పోరాటాలు నిర్వహించారు.

ముందస్తు అంచనాలు..

ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచి రాజకీయాలను చాలా దగ్గరి నుంచి పరిశీలిస్తున్న పవన్‌కల్యాణ్‌కు తన బలాలు, బలహీనతలపై చాలా స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. 2019 ఎన్నికల ఫలితాలు ఆయనకు మంచి అనుభవాన్ని అందించాయి. ఎక్కడ పర్యటనకు వెళ్లినా మధ్యతరగతి వర్గాలు, వివిధ వృత్తుల వారితో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చే నైపుణ్యమూ ఆయన సొంతం. దేశంలోని అనేక రాజకీయ పార్టీల ఉత్థాన పతనాలపై, వారి రాజకీయ సిద్ధాంతాలపై జనసేన అధిపతికి స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ప్రజాభిమానాన్ని కోల్పోయిందని చాలా ముందే అంచనా వేశారు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని 2021లోనే ఇప్పటం సభలో పవన్‌కల్యాణ్‌ కీలక ప్రకటన చేశారు. ఆ పరిణామంతో నాడే రాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తిరిగింది. విశాఖ వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నప్పుడు, ఇప్పటం గ్రామస్థులు జనసేన సభకు స్థలం ఇవ్వడంతో వారి ఇళ్లు కూల్చినప్పుడు, చంద్రబాబు అరెస్టు సమయంలో తాను మంగళగిరి వస్తోంటే రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిలువరించినప్పుడు పవన్‌ ఆవేశంగా స్పందించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎంత దూకుడుగా వెళ్లాలో అంతే దూకుడు ప్రదర్శించారు.

బలాలు, బలహీనతలపై పక్కా లెక్క

రాజకీయాల్లోనూ టైమింగ్‌ చాలా ముఖ్యం. చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమహేంద్రవరం జైలులో ఆయన్ని పరామర్శించి తెదేపాతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్‌ ప్రకటించిన తీరు నాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. చంద్రబాబు అరెస్టుతో నాటి ప్రజాగ్రహాన్ని సరిగ్గా గుర్తించి.. జనసేన అధిపతి తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్దండులను ఆశ్చర్యపరిచింది. భాజపాతో సంబంధం లేకుండానే నాడు తెదేపాతో పొత్తు ప్రకటించారు. ఆ తర్వాత భాజపాను కూడా ఈ పొత్తులోకి తీసుకురావడానికి పవన్‌కల్యాణ్‌ దిల్లీలోనూ, విజయవాడలోనూ కృషి చేశారు. తొలుత జనసేనకు 24 శాసనసభ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలు ఇచ్చేలా తెదేపాతో పొత్తు కుదిరింది. ఆ తర్వాత భాజపా పెద్దలు పొత్తు కుదుర్చుకునేందుకు రాగా.. వారి డిమాండ్‌ నెరవేర్చేందుకు పవన్‌ మూడు శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానాన్ని త్యాగం చేశారు. చివరికి తన సోదరుడు నాగబాబు పోటీ చేయాలనుకున్న అనకాపల్లి స్థానాన్ని భాజపా కోసం వదులుకున్నారు. కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యే విషయంలో ఇంటా, బయటా విమర్శలు వస్తే దీటుగా ఎదుర్కొన్నారు.


జనసేనానికి ఘన స్వాగతం

గన్నవరం విమానాశ్రయంలో జనసేనాని పవన్‌ దంపతులకు స్వాగతం పలుకుతున్న నాయకులు

గన్నవరం గ్రామీణం, హైదరాబాద్, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం అనంతరం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. సతీమణి అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్, సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌లతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చారు. జనసైనికులు, అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో మంగళగిరి బయలుదేరి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు