Congress: పోరాడినా బోణీ కొట్టని కాంగ్రెస్‌

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి 2014లో, 2019లో... ఇప్పుడు 2024లోనూ ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈసారి ఒకట్రెండు సీట్లయినా సాధించుకోవాలన్న కాంగ్రెస్‌ ఆశలు గల్లంతయ్యాయి.

Updated : 05 Jun 2024 07:29 IST

వరుసగా మూడోసారీ తీవ్ర నిరాశే 
కడప ఎంపీ నియోజకవర్గంలో 1,41,039 ఓట్లతో తృతీయ స్థానంలో షర్మిల 
కర్నూలు, నెల్లూరులో కాస్త ఉనికి చాటుకున్న పార్టీ 

ఈనాడు, అమరావతి:  సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి 2014లో, 2019లో... ఇప్పుడు 2024లోనూ ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈసారి ఒకట్రెండు సీట్లయినా సాధించుకోవాలన్న కాంగ్రెస్‌ ఆశలు గల్లంతయ్యాయి. 156 శాసనసభ, 23 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోటా బోణీ కొట్టలేదు. మూడు లోక్‌సభ, మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు 50 వేల నుంచి లక్షకుపైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దక్కిన ఊరట ఇదే. విభజిత ఏపీలో కాంగ్రెస్‌ ఉనికి ప్రశ్నార్థకమైన నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ముందు వై.ఎస్‌.షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీకి జవసత్వాలొచ్చాయి. ఈ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల 1,41,039 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.  కర్నూలు, తిరుపతి, నెల్లూరు, రామహేంద్రవరం లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన రాంభూపాల్‌ యాదవ్‌కు 70,373, చింతామోహన్‌కు 65,523, కొప్పుల రాజుకు 54,844, గిడుగు రుద్రరాజుకు 32,508 ఓట్లు వచ్చాయి. ముక్కోణపు పోటీల్లో శాసనసభ నియోజకవర్గాలైన చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌ 41,859 ఓట్లు, మడకశిరలో సుధాకర్‌ 17,380 ఓట్లను సాధించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ షర్మిలకు మద్దతుగా కడపలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. 

కడప గడ్డపై వైకాపాకు ముచ్చెమటలు 

కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన షర్మిల వైకాపాకు ముచ్చెమటలు పట్టించినా... ఫలితాల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్‌ మరోసారి టికెట్‌ ఇవ్వడం షర్మిలకు ఆగ్రహం కలిగించింది. అవినాష్‌ ఓటమే లక్ష్యంగా బరిలో దిగారు. ఆమెకు దివంగత వివేకా కుమార్తె సునీత తోడై ప్రచారం చేశారు. వీరిద్దరి ప్రచారం కడప లోక్‌సభ నియోజకవర్గంలోని వైకాపా శిబిరంలో కలకలం సృష్టించింది. వివేకా హత్య కేసులో నిందితులను సీఎం జగన్‌ కాపాడుతున్నారని, ఇవి న్యాయానికి, నేరానికి జరుగుతున్న ఎన్నికలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి జగన్‌ తాకట్టు పెట్టారని జగన్‌పై ఘాటైన విమర్శలు చేశారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటులో వైఫల్యాన్ని ఎండగట్టారు. షర్మిల చేసిన విమర్శలు, ఆరోపణలపై సీఎం జగన్, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిలు ఎన్నికల సభల్లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సీఎం సతీమణి భారతి కడప లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం చేయాల్సి వచ్చింది. షర్మిల తర్వాత అత్యధికంగా కర్నూలులో పోటీ చేసిన రాంభూపాల్‌ యాదవ్‌కు 70,373 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓటర్లు ఆయనకు మద్దతివ్వడంతో భారీ సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి. నెల్లూరు నుంచి పోటీ చేసిన కొప్పుల రాజుకు 54,844 ఓట్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో గతంలో కలెక్టర్‌గా పని చేసినప్పుడు ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రజలు ఓట్లేశారు. కాకినాడ, బాపట్ల నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం 41,673, ఎం.ఎం.పళ్లంరాజు 21,109 ఓట్లతో మూడో స్థానాల్లో నిలిచారు. మిగిలినచోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. 

ముక్కోణపు పోటీలో మూడో స్థానానికి... 

శాసనసభకు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో కాంగ్రెస్‌ ప్రయోగాలు చేసినా ఫలించలేదు. కాంగ్రెస్‌ నుంచి పలువురు పార్టీ టికెట్లు ఆశించినా వారిని పక్కన పెట్టి వైకాపా నుంచి బయటకొచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమిచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, తిరుపతి జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు, ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలీజా పోటీ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మురళి, ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, సత్యసాయి జిల్లా మడకశిరలో సుధాకర్‌ పోటీ చేశారు. చీరాల, మడకశిరలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్‌కు విజయావకాశాలపైనా పెద్దఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలైన కూటమి, వైకాపా అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. మడకశిరలో సుధాకర్‌కు మద్దతుగా మొదట ప్రచారం చేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి చివరి క్షణంలో మిన్నకుండిపోయారు. దీంతో 17,380 ఓట్లతో సుధాకర్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా విజయం వరించలేదు. వైకాపా నుంచి వచ్చి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఆర్థర్‌కు 7,949 ఓట్లు, ఎంఎస్‌ బాబుకు 2,820, ఎలీజాకు 4,958 ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమిలో భాగంగా 18 శాసనసభ, మరో రెండు లోకసభ నియోజకవర్గాల్లో సీపీఎం, సీపీఐల అభ్యర్థులకు మద్దతిచ్చినా ప్రతికూల ఫలితాలొచ్చాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని