Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ముమ్మరం

ష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Updated : 11 Jun 2024 07:51 IST

కేసరపల్లిలో 11.18 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదిక
వీఐపీలకు 4 గ్యాలరీలు, మిగతా సాధారణ ప్రజలకు
నేటి సాయంత్రానికి పూర్తి కానున్న పనులు
ప్రధాని రాక నేపథ్యంలో అడగడుగునా తనిఖీలు
మోదీ పర్యటనపై అధికారులతో సీఎస్‌ సమీక్ష
వాహనాల పార్కింగ్‌కు 56 ఎకరాల కేటాయింపు 

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి..
సోమవారం రాత్రి పది గంటలకు సిద్ధమైన ప్రధాన వేదిక

ఈనాడు, అమరావతి, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కూటమిలోని తెదేపా, భాజపా, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీల రాకపోకలకు అనువుగా ఉండేలా కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీప కేసరపల్లిలో ఎన్‌హెచ్‌-16 పక్కనే ఐటీ పార్కు ప్రాంగణం వద్ద ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధాన వేదిక నిర్మాణం సోమవారానికి పూర్తికాగా.. సీటింగ్‌ ఏర్పాట్లు, గ్యాలరీల పనులు కొనసాగుతున్నాయి. 11.18 ఎకరాల ప్రైవేటు భూమిలో ప్రధాన వేదిక సిద్ధమవుతోంది. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా పూర్తిగా పైకప్పు వేస్తున్నారు. వీఐపీలకు నాలుగు గ్యాలరీలు కేటాయించగా, మిగిలిన ప్రాంగణంలో సాధారణ ప్రజలు కూర్చునేందుకు సీటింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు. మంగళవారం సాయంత్రానికి ప్రధాన వేదికను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించే పనులు కూడా పూర్తి చేయనున్నారు. సభా ప్రాంగణంతో పాటు రహదారుల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. ఇప్పటికే ప్రాంగణం పోలీసులు, ఎన్‌ఎస్‌జీ ఆధీనంలో ఉంది. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. జనరేటర్ల తరలింపు, విశ్రాంతి గదులు, వైద్య శిబిరాల పనులు ఇప్పటికే పూర్తిచేశారు. 

ప్రధాన వేదిక ముందు కొనసాగుతున్న గ్యాలరీల ఏర్పాటు పనులు 

చంద్రబాబు సమీక్ష 

సభ ఏర్పాట్లపై తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాల్ని చంద్రబాబుకు సీఎస్, డీజీపీలు వివరించారు. పార్టీ తరఫున చేస్తున్న ఏర్పాట్లను అచ్చెన్నాయుడు తెలిపారు.

జాతీయ రహదారులపై ఆంక్షలు 

వివిధ మార్గాల గుండా వచ్చే వాహనాల పార్కింగుకు 56 ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించారు. ప్రధాన వేదిక చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి ఆనుకొని ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల మీదుగా వెళ్లే పలు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఆంక్షలు విధించారు. ఇవి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. 

అతిథులు సభావేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం 

ప్రధాని పర్యటనపై సీఎస్‌ సమీక్ష

సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నందున ఆయన పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ప్రధాని పర్యటనపై సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 12న ఉదయం 8.20 గంటలకు ప్రధాని దిల్లీలో బయలుదేరి 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.55 గంటలకు కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణానికి చేరుకుని 11 గంటల నుంచి 12.30 వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి 12.40కి భువనేశ్వర్‌ చేరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. మరోవైపు కేసరపల్లిలో జరుగుతున్న పనులపై రాష్ట్ర రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న సమీక్షించారు. మంగళవారం సాయంత్రంలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన వేదిక పుష్పాలంకరణ పక్కాగా చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. అప్రోచ్‌ రోడ్లను సత్వరం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రసారాలను ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

 ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌


వివిధ మార్గాల్లో మళ్లింపులు ఇలా..

విశాఖపట్నం-చెన్నై మార్గం: విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు కత్తిపూడి - నరసాపురం - మచిలీపట్నం - రేపల్లె - చెరుకుపల్లె - బాపట్ల - చీరాల - త్రోవగుంట మీదుగా ఒంగోలు వద్ద జాతీయ రహదారి ఎక్కి చెన్నై వైపు వెళ్లాలి.

చెన్నై-విశాఖపట్నం:  చెన్నై - ఒంగోలు - త్రోవగుంట - చీరాల - మచిలీపట్నం - కృత్తివెన్ను - లోసరి వంతెన - నరసాపురం - అమలాపురం - కత్తిపూడి మీదుగా విశాఖపట్నం మార్గంలో ప్రయాణించాలి. 

  • గుంటూరు జిల్లా బుడంపాడు - తెనాలి - పులిగడ్డ - మచిలీపట్నం - నరసాపురం - కత్తిపూడి వద్ద చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి ఎక్కి విశాఖపట్నం వైపు వెళ్లాలి.

విశాఖ-హైదరాబాద్‌: గామన్‌ వంతెన - దేవరపల్లి - జంగారెడ్డిగూడెం - అశ్వారావుపేట - ఖమ్మం మీదుగా హైదరాబాద్‌ 

  • భీమడోలు - ద్వారకాతిరుమల - కామవరపుకోట - చింతలపూడి నుంచి ఖమ్మం వైపు మళ్లాలి 
  • ఏలూరు బైపాస్‌ - జంగారెడ్డిగూడెం - అశ్వారావుపేట - ఖమ్మం మీదుగా హైదరాబాద్‌ వైపు 
  • ఏలూరు బైపాస్‌ - చింతలపూడి - సత్తుపల్లి మీదుగా హైదరాబాద్‌ 
  • హనుమాన్‌ జంక్షన్‌ - నూజివీడు - మైలవరం - ఇబ్రహీంపట్నం - నందిగామ మీదుగా హైదరాబాద్‌ వైపు 

హైదరాబాద్‌-విశాఖ: హైదరాబాద్‌ - నందిగామ - మధిర - వైరా - సత్తుపల్లి - అశ్వారావుపేట - జంగారెడ్డిగూడెం - దేవరపల్లి - గామన్‌ వంతెన మీదుగా విశాఖ వైపు 

  • ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం - మైలవరం - నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ - ఏలూరు బైపాస్‌ మీదుగా విశాఖపట్నం 
  • విజయవాడ శివారు రామవరప్పాడు - నున్న - పాములకాలవ - వెలగలేరు - జి.కొండూరు - మైలవరం - నూజివీడు - హనుమాన్‌ జంక్షన్‌ - ఏలూరు బైపాస్‌ మీదుగా విశాఖపట్నం 
  • విజయవాడ - ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు - తాడిగడప - కంకిపాడు - పామర్రు - గుడివాడ నుంచి భీమవరం మీదుగా వెళ్లాలి.

వైకాపా బాధితులకు ఆహ్వానం  

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: సభకు రాష్ట్ర వ్యాప్తంగా 104 వైకాపా బాధిత కుటుంబాలను ఆహ్వానించారు. వారిలో పల్నాడు జిల్లా నుంచే 90 మంది ఉన్నారు. మాచర్లలో చంద్రయ్య అనే తెదేపా కార్యకర్తను పట్టపగలు హత్య చేశారు. 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజులకే మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో తెదేపా సానుభూతిపరులపై దాడులకు పాల్పడ్డారు. చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్న తరుణంలో అలాంటి బాధితులకు ఆహ్వానాలు అందాయి. వారిలో చంద్రయ్య కుటుంబం, పాల్వాయిగేటు గ్రామ పోలింగ్‌ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుకొని గాయపడ్డ నంబూరి శేషగిరిరావు కుటుంబం, పోలింగ్‌ రోజు వైకాపా నాయకుల గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ చేరెడ్డి మంజుల తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని