Hyper Adi: పవన్‌ కల్యాణ్‌కు లక్షకు పైగా మెజారిటీ: హైపర్‌ ఆది

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తరఫున ప్రచారం చేసేందుకు నటుడు హైపర్‌ ఆది పిఠాపురం వెళ్లారు. ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడారు.

Updated : 11 Apr 2024 20:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు లక్షకుపైగా మెజారిటీ వస్తుందని నటుడు హైపర్‌ ఆది (Hyper Adi) ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లలో ఒకరైన ఆయన గురువారం పిఠాపురం చేరుకుని, ప్రచారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే ఇక్కడ నాగబాబు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతోపాటు నేను ఈ రోజు ప్రచారం చేశా. ఏ ఇంటికి వెళ్లినా ‘పవన్‌ కల్యాణ్‌కే మా ఓటు’ అని అందరూ చెబుతున్నారు. ప్రస్తుతానికి నేను ఏ షూటింగ్స్‌లో పాల్గొనడం లేదు. ఈ నెలంతా పవన్‌కల్యాణ్‌, ఆయన ఎంపిక చేసిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నా. ఎన్నికలు పూర్తయిన తర్వాతే చిత్రీకరణలకు హాజరవుతా. పవన్‌కల్యాణ్‌ నిధుల కోసం ఎదురుచూడరు. సొంత డబ్బుతో అభివృద్ధి చేయగల సమర్థుడాయన. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా మాట్లాడుకుంటారు. హైదరాబాద్‌ను సందర్శించేందుకు విదేశాల నుంచి ఎలాగైతే వస్తున్నారో పవన్‌కల్యాణ్‌ గెలిస్తే పిఠాపురాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అలాగే వస్తారు. పవన్‌ను సపోర్ట్‌ చేసేందుకు త్వరలో మరికొందరు నటులు ముందుకొస్తారు’’ అని తెలిపారు.

తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్‌ అంబటి రాయుడు, నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌, సినీ నటులు సాగర్‌, పృథ్వీ, హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీను ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని