PM Modi: దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ

సంపన్న కుటుంబంలో జన్మించిన వారికి సామాన్యుల కష్టాలు తెలియవని రాహుల్‌, అఖిలేశ్‌, తేజస్వీ యాదవ్‌లను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Updated : 21 May 2024 16:54 IST

పట్నా: అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, సనాతన వ్యతిరేక ఆలోచనా విధానం కలిగిన విపక్షాల కూటమికి.. ఈ ఎన్నికల ఫలితాల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌లపై పరోక్షంగా విరుచుకుపడిన ఆయన.. సంపన్న కుటుంబాల్లో జన్మించిన వారికి సామాన్యుల కష్టాలు తెలియవన్నారు. తనకు వారసులు ఎవరూ లేరని, దేశ ప్రజలంతా తన వారసులేనన్నారు. బిహార్‌లోని తూర్పు చంపారన్‌, మహారాజ్‌ గంజ్‌లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అంబేడ్కర్‌ లేకుంటే..

‘‘అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, తుక్డే-తుక్డే గ్యాంగులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న విపక్షాల కూటమి పాపాలతో దేశం ముందుకుసాగదు. సనాతన ధర్మాన్ని దూషించే వికృత మనస్తత్వం వారిది. రానున్న రెండు దశలు, ఆ తర్వాత తుది ఫలితాల్లో వారికి భంగపాటు తప్పదు. అణగారిన వర్గాల రిజర్వేషన్లను లాక్కొని.. ఓ వర్గం వారికి కేటాయించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది. అంబేడ్కర్‌ లేకుంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను నెహ్రూ కల్పించేవారు కాదు’’ అని మోదీ పేర్కొన్నారు.

సంపన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్లకు..

‘‘ఎన్నికల తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటానని కొందరు (తేజస్వీ)చెబుతున్నారు. నా కన్నీళ్లు చూడాలని రాజకుమారుడు (రాహుల్‌ గాంధీ) కోరుకుంటున్నాడు. నేను జీవితం చరమాంకానికి చేరుకున్నానని, అందుకే వారణాసి నుంచి పోటీ చేస్తున్నానని ఓ నాయకుడు (అఖిలేశ్‌) చెబుతున్నాడు. ఇలా సంపన్న కుటుంబాల్లో జన్మించిన వీళ్లకు.. సామాన్యుల కష్టాలు తెలియవు’’ అని విపక్ష నాయకులపై మండిపడ్డారు. ప్రత్యర్థులు స్విస్‌ బ్యాంకుల్లో నోట్ల కట్టలను దాచి పెట్టుకున్నారని, పేద కుటుంబంలో పుట్టిన తన మాదిరిగా పేదల కష్టాలను అర్థం చేసుకోలేరన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్‌లు కలిసి బిహార్‌ను దోపిడీ రాజ్యంగా మార్చేశాయని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని