Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్‌

భాజపాతో (BJP) మళ్లీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) స్పష్టం చేశారు. దానికి బదులు చనిపోవడమే మేలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated : 31 Jan 2023 04:36 IST

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) భాజపాపై ఉన్న అసంతృప్తిని మరోసారి బయటపెట్టారు. భాజపాతో మళ్లీ కలిసి పనిచేసే అంశాన్ని తోసిపుచ్చిన ఆయన.. వారితో జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో తమ నుంచి కాషాయ పార్టీనే లాభపడిందన్న నీతీశ్‌.. వారికి దూరంగా ఉండే ఓ వర్గం ఓట్లతోనూ భాజపా ప్రయోజనం పొందిందని చెప్పారు. ప్రజామోదం లేని ముఖ్యమంత్రితో మళ్లీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదంటూ బిహార్‌ భాజపా శ్రేణులు చేస్తోన్న ప్రకటనలపై నీతీశ్‌ కుమార్‌ ఈవిధంగా స్పందించారు.

బిహార్‌లో వచ్చే ఎన్నికల్లో 40లోక్‌సభ స్థానాలకు గాను 36 చోట్ల గెలుస్తామని భాజపా చెప్పడంపైనా నీతీశ్‌ కుమార్‌ విమర్శలు గుప్పించారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తోపాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌లపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని.. 2017లో ఎన్డీఏలోకి వచ్చి తప్పిదం చేశానని నీతీశ్‌ కుమార్‌ ఉద్ఘాటించారు.

‘జేడీయూతో కలిసి పనిచేస్తామంటూ వచ్చే వదంతులను పార్టీ కేడర్‌లో కట్టడి చేశాం. అయితే, లోలకం మాదిరిగా ఊగిసలాడే అలవాటు ముఖ్యమంత్రికి (నీతీశ్‌) ఉంది. మరోసారి ఆయన చేతిలో మోసపోయేందుకు సిద్ధంగా లేము’ అని భాజపా బిహార్‌ చీఫ్‌ సంజయ్‌ జైశ్వాల్‌ ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రజామోదం లేదని.. ద్రోహం చేసే అలవాటున్న ఆయనతో జట్టు కట్టే ప్రసక్తే లేదన్నారు. ఇదే విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని