Devendra Fadnavis: పారిపోవట్లేదు.. పక్కా ప్లానింగ్‌తో ఉన్నాం: ఫడణవీస్‌

భాజపా అగ్రనేత అమిత్‌ షా సూచనతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) రాజీనామా విషయంలో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఉద్వేగంతో అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. 

Published : 08 Jun 2024 16:46 IST

దిల్లీ: మహారాష్ట్రలో (Maharashtra) భాజపా (BJP) పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధమైన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis).. తర్వాత తన మనసు మార్చుకున్నారు. తాను పారిపోవాలనుకోవడం లేదన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘నేను అందరి ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నాను. ప్రధాని మోదీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. లోకసభాపక్ష నేతగా మోదీ పేరును ఎన్డీయే పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈసారి మహారాష్ట్రలో మాకు ఆశించిన స్థాయిలో సీట్లు దక్కలేదు. లోక్‌సభ ఎన్నికల నిమిత్తం పార్టీని ముందుండి నడిపించాను. అందుకే ఓటమికి నేను బాధ్యత తీసుకున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుంచి పనిచేసేందుకు వీలుగా.. నా పదవి నుంచి దిగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని అగ్రనాయకత్వాన్ని కోరాను. కానీ వారు నాపై నమ్మకం ఉంచారు. నేను ఉద్వేగంతో ఆ నిర్ణయం తీసుకోలేదు. వ్యూహాత్మకంగానే వ్యవహరించాను. ఇప్పటికే భవిష్యత్తు వ్యూహానికి ప్రణాళిక సిద్ధం అవుతోంది’’ అని ఫడణవీస్‌ వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఫడణవీస్‌ నేతృత్వంలోని భాజపా.. శివసేన (ఏక్‌నాథ్‌ శిందే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌)తో కలిసి బరిలో దిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి శివసేనతో కలిసి పోటీ చేసిన భాజపా 48 స్థానాలకు గానూ 41 చోట్ల విజయం సాధించింది. కానీ, తాజాగా మహాయుతి కూటమి కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్‌, శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే), ఎన్సీపీ(శరద్‌పవార్‌)లతో కలిసి ఏర్పాటైన మహా వికాస్‌ అఘాడీ 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబరులో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. భాజపా పుంజుకునేందుకు అవసరమైన చర్యలు ఇప్పటినుంచే ప్రారంభించాలని అమిత్‌ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు