BJP: భాజపాలో చేరిన IAS అధికారిణి.. రాజీనామా ఇంకా ఆమోదించలేదన్న పంజాబ్‌ సీఎం!

ఐఏఎస్‌ అధికారిణి పరంపాల్‌ కౌర్‌ తన పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరడంపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ స్పందించారు.

Published : 11 Apr 2024 18:20 IST

చండీగఢ్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ పంజాబ్‌లో అకాలీదళ్‌ నేత, మాజీమంత్రి సికిందర్‌ సింగ్‌ మలుకా కోడలు పరంపాల్‌ కౌర్‌ సిద్ధు భాజపా (BJP)లో చేరారు. ఐఏఎస్‌ అధికారిణి అయిన ఆమె తన పదవికి రాజీనామా చేసి గురువారం దిల్లీలో కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తాడ్వే సమక్షంలో తన భర్తతో కలిసి కమలదళంలో చేరారు. దీనిపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. పరంపాల్‌ కౌర్‌ సిద్ధూ తన ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని స్పష్టంచేశారు. రాజీనామాకు ఒక ప్రొసీజర్‌ ఉంటుందన్న ఆయన.. ఎలా రాజీనామా చేయాలో దయచేసి తెలుసుకోవాలని ఆమెకు హితవు పలికారు. లేదంటే సంపాదన ప్రమాదంలో పడే అవకాశం ఉండొచ్చని సూచించారు. 

నటుల రాజకీయ రణస్థలం.. లోక్‌సభ ఎన్నికల్లో 20 మందికి పైగా పోటీ

 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి అయిన పరంపాల్‌ కౌర్‌.. పంజాబ్‌ రాష్ట్ర ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ ఎండీగా కొనసాగారు. ఆమె భాజపాలో చేరే అవకాశం ఉందంటూ పెద్దఎత్తున ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చిన  నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో తన రాజీనామా లేఖను సీఎస్‌ ద్వారా ముఖ్యమంత్రికి ఆమె పంపారు. ఏడాది అక్టోబర్‌లో పదవీవిరమణ చేయాల్సిఉండగా.. ముందుగానే ఆమె తన పదవికి రిటైర్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ప్రాతినిధ్యం వహిస్తున్న బటిండా లోక్‌సభ స్థానం నుంచి పరంపాల్‌ కౌర్‌ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని