Voting: సొంతవాళ్లే ఓటెయ్యలేదు.. ఒక్క ఓటుతో ఓడిపోయారు..!

Elections: సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో  ఇప్పటివరకు ఇద్దరు అభ్యర్థులు కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక్కడ మరో విషయమేంటంటే.. వారికి కనీసం సొంతవాళ్లే ఓటెయ్యలేదట..!

Updated : 04 Apr 2024 13:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజాస్వామ్య ఎన్నికల (Elections) ప్రక్రియలో ప్రతి ఓటరూ కీలకమే. ఒక్క ఓటే (Vote) కదా అని తేలిగ్గా తీసుకుంటే ఫలితం తారుమారవడం ఖాయం అది. కొందరి విషయంలో అది అక్షరాలా నిజమైంది..! మన దేశ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అలా ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు కేవలం ఒకే ఒక్క ఓటు (Single Vote) తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదీనూ వారి సొంతవాళ్లే ఓటును హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం..!

డ్రైవర్‌కు సెలవు ఇవ్వక..

2004లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆ ఎన్నికల్లో సంతెమరహళ్లి నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ నేత ఏఆర్‌ కృష్ణమూర్తి, కాంగ్రెస్‌ నుంచి ఆర్‌ ధ్రువనారాయణ పోటీ చేశారు. ఫలితాల్లో కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా.. నారాయణ 40,752 ఓట్లతో విజయం సాధించారు. అంటే కేవలం ఒకే ఒక్క ఓటుతో జేడీఎస్‌ నేత ఓడిపోవాల్సి వచ్చింది. మరో విషయమేంటంటే.. కృష్ణమూర్తి డ్రైవర్‌ తన ఓటు హక్కను వినియోగించుకోవాల్సి ఉండగా.. ఆ రోజు అతడికి సెలవు దొరకలేదట. డ్రైవర్‌ కూడా ఆ నియోజకవర్గానికి చెందిన ఓటరే. అతడు ఓటు వేసి ఉంటే.. టాస్‌ ద్వారా ఫలితం తేలి ఉండేదోమో..!

నాలుగేళ్ల తర్వాత రాజస్థాన్‌లోనూ..

ఇక, 2008లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితం పునరావృతమైంది. ఆ ఎన్నికల్లో నాథ్‌ద్వారా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీపీ జోషీ, భాజపా నేత కల్యాణ్‌ సింగ్‌ చౌహన్‌ పోటీ చేశారు. ఫలితాల్లో చౌహాన్‌కు 62,216 ఓట్లు, సీపీ జోషీకి 62,215 ఓట్లు దక్కాయి. ఆ సమయంలో సీఎం రేసులో ముందంజలో ఉన్న జోషీకి ఈ ‘ఒక్క ఓటు తేడా’ ఓటమి గట్టి షాకిచ్చింది.

దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు. చౌహన్‌ సతీమణి రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేశారని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై రాజస్థాన్‌ హైకోర్టు జోషీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయారు. కొన్నాళ్ల తర్వాత మరో ఆసక్తికర విషయం బయటపడింది. జోషీ తల్లి, సోదరి, డ్రైవర్‌ ఓటు హక్కు వినియోగించుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏదేమైనా ఒక్క ఓటుతో ఆయనకు పరాజయం తప్పలేదు.

సింగిల్‌ డిజిట్‌ తేడాతో ఎంపీలు..

1962 నుంచి ఇప్పటివరకు సింగిల్‌ డిజిట్‌ తేడాతో ఇద్దరు ఎంపీలు గెలిచారు. 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత కొణతాల రామకృష్ణ తన సమీప అభ్యర్థిపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత 1998లో బిహార్‌లోని రాజ్‌మహల్‌ స్థానం నుంచి భాజపా నేత సోమ్‌ మరండి కూడా 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని