PM Modi: ‘వాళ్లది కమీషన్‌.. మాది మిషన్‌’.. ఇండియా కూటమిపై మోదీ విసుర్లు

ఇండియా కూటమిపై మరోసారి ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. వారు కమీషన్ల కోసం పనిచేస్తే.. తాము మిషన్‌ కోసం పని చేస్తున్నామన్నారు.

Updated : 06 Apr 2024 15:14 IST

షహరాన్‌పూర్‌ (యూపీ): ఇండియా కూటమిపై ప్రధాని మోదీ (PM Modi) మరోసారి విమర్శలు గుప్పించారు. కమీషన్లే కూటమి అసలు లక్ష్యమని, అందుకోసమే వారు అధికారం కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మాత్రం ఓ మిషన్‌ కోసం పని చేస్తోందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శనివారం ఆయన మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా.. వారి ధ్యాసంతా కమీషన్ల మీదే ఉండేది. ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఆ కమీషన్ల కోసమే అధికారం కోరుకుంటోంది. ఎన్డీయే, మోదీ సర్కారు మాత్రం ఓ మిషన్‌ కోసం పని చేస్తోంది. భాజపా 370 సీట్లలో గెలవకుండా ఆపడానికి విపక్షాలు విఫలయత్నం చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ గంటకో అభ్యర్థిని మారుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తాము బలమైన సీటుగా భావించే చోట్ల కూడా కనీసం అభ్యర్థులను బరిలో దింపే సాహసం చేయడం లేదు’’ అని మోదీ అన్నారు.

భారత ఎన్నికల్లో జోక్యానికి చైనా యత్నాలు.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన

ఈసందర్భంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోపైనా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అందులో ముస్లింలీగ్‌ ముద్ర, వామపక్ష భావజాలం కలిగిన వారి ఆధిపత్యం కనిపిస్తోందన్నారు. అనిశ్చితికి, అస్థిరతకు పర్యాయపదంగా ఇండియా కూటమి తయారైందన్నారు. ప్రజలు కూడా వారిని సరిగా పట్టించుకోవడం లేదన్నారు. యూపీలో 8 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. అందులో షహరాన్‌పూర్‌తో పాటు కైరానా, ముజఫర్‌ నగర్‌, బిజ్నోర్‌, నాగిన, మొరాద్‌బాద్‌, రాంపూర్‌, పిల్‌భిత్‌ స్థానాలు ఉన్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని