Mallikarjun Kharge: భాజపా చేతికి పగ్గాలొద్దు

భాజపా తమను పాలించకూడదనేది ప్రజల ఆకాంక్ష అని, అది నెరవేరేలా సరైన సమయంలో తగిన అడుగులు వేయాలని ఇండియా కూటమి నిర్ణయించుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

Updated : 06 Jun 2024 06:53 IST

ప్రజల మనోభీష్టం ఇదే
తగిన సమయంలో ‘సరైన’ అడుగులు వేస్తాం
మరికొన్ని పార్టీలు మాతో చేతులు కలపాలి
ఇండియా కూటమి నేతల తొలిభేటీలో ఖర్గే

దిల్లీ: భాజపా తమను పాలించకూడదనేది ప్రజల ఆకాంక్ష అని, అది నెరవేరేలా సరైన సమయంలో తగిన అడుగులు వేయాలని ఇండియా కూటమి నిర్ణయించుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పనితీరు మెరుగుపరచుకున్న తర్వాత కూటమి పక్షాలతో బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో తొలిసారి సమావేశమయ్యారు. దాదాపు రెండుగంటలసేపు ఇది కొనసాగింది. అనంతరం ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుతం తాము ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని, మోదీ నేతృత్వంలోని ఫాసిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘..కచ్చితంగా ఈసారి తీర్పు మోదీకి, ఆయన తరహా రాజకీయాలకు వ్యతిరేకంగా వచ్చినదే. వ్యక్తిగతంగానూ ఆయనకు భారీ రాజకీయ నష్టమిది. నైతికంగానైతే స్పష్టంగా ఆయన ఓడిపోయారు. అయినా ప్రజాతీర్పును కాలరాయడానికే ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాజ్యాంగం కల్పించిన నిబంధనలకు, రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన విలువలకు కట్టుబడి ఉండే అన్ని పక్షాలనూ మా కూటమి ఆహ్వానిస్తోంది. ప్రజావాంఛ నెరవేర్చడానికి అవసరమైన చర్యలు చేపడుతుంది. దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయించింది’ అని చెప్పారు. భాగస్వామ్య పక్షాలన్నీ ఎన్నికల్లో ఐక్యంగా, దృఢ సంకల్పంతో, చక్కగా పోరాడాయని కొనియాడుతూ వాటికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలపై ఇండియా కూటమి నేతలు కీలకమైన సమాలోచనలకు శ్రీకారం చుట్టారు. మాజీ భాగస్వాములైన తెదేపా, జేడీయూ వంటి పార్టీల నుంచి మద్దతు పొందడానికి ఎంతమేరకు అవకాశం ఉంటుందనేది వారు ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో భాజపా 240 సీట్లు సాధించగా 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించింది. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయేకి 293 సీట్లతో మెజారిటీ ఉండగా, విపక్ష కూటమి 234 వద్ద ఆగిపోయింది. దీంతో సంఖ్యాబలాన్ని పెంచుకునే అవకాశాలపై ఇండియా కూటమి దృష్టిసారించింది. సమావేశంలో ఖర్గేతో పాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు- సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ; తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, టి.ఆర్‌.బాలు (డీఎంకే); ఝార్ఖండ్‌ సీఎం చంపయీ సోరెన్, కల్పనా సోరెన్‌ (జేఎంఎం); శరద్‌పవార్, సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ); అఖిలేశ్‌ యాదవ్, రాంగోపాల్‌ యాదవ్‌ (ఎస్పీ); సంజయ్‌సింగ్, రాఘవ్‌ చడ్డా (ఆప్‌); సంజయ్‌ రౌత్, అరవింద్‌ సావంత్‌ (శివసేన యూబీటీ); ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), అభిషేక్‌ బెనర్జీ (తృణమూల్‌), తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ) పాల్గొన్నారు. 


తెదేపా, జేడీయూపై ఇంకా చర్చించలేదు: పవార్‌ 

కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు కోసం తెదేపా, జేడీయూలను సంప్రదించాలా అనే విషయం ఇంకా చర్చించుకోలేదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌పవార్‌ అంతకుముందు విలేకరులకు చెప్పారు. నరేంద్ర మోదీ సర్కారు పనితీరుపై ఓటర్లలో ఆగ్రహం, అసంతృప్తి ఉన్నాయని చెప్పారు. ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలా, వద్దా అనేది తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అగ్రనేత నీతీశ్‌కుమార్‌ నిర్ణయించుకోవాలని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ చెప్పారు. ‘‘నిరంకుశవాదితో చేతులు కలిపి ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేయాలా వద్దా అనేది చంద్రబాబు, నీతీశ్‌ తేల్చుకోవాలి. వారు అలా వెళ్తారని నేనైతే అనుకోవడం లేదు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని మోదీ ఏర్పాటుచేయలేరు’’ అని రౌత్‌ పేర్కొన్నారు. 

వేచి చూడండి: తేజస్వి

విపక్ష కూటమిలో తెదేపా, జేడీయూ చేరుతాయా లేదా అనే విషయంలో వేచి చూడాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కోరారు. ఈ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌లా బిహార్‌ అవతరించిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని