India bloc in Bihar: బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్‌

బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి.

Published : 29 Mar 2024 13:39 IST

పట్నా: బిహార్‌లో ఇండియా కూటమి (INDIA bloc) పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలింది. మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గానూ 26 స్థానాల్లో అర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్‌ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల బరిలో దిగనున్నారు. కథియార్‌, కిషన్‌ గంజ్‌, పట్నా సాహిబ్‌, ససారాం, భాగల్‌పూర్‌, వెస్ట్‌ చంపారన్‌, ముజఫర్‌పూర్‌, సమస్తిపూర్‌, మహరాజ్‌ గంజ్‌ సీట్లను కాంగ్రెస్‌కు కేటాయించారు. బెగుసరాయ్‌, ఖగారియా, అర్హ్‌, కరకట్‌, నలంద స్థానాల నుంచి వామపక్ష అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మిగిలిన చోట్ల ఆర్జేడీ తమ అభ్యర్థులను పోటీలో నిలపనుంది.

బిహార్లోని 40 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19, 26, మే 7, 13, 20, 25, జూన్‌ 1 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క స్థానం దక్కించుకోగా.. ఆర్జేడీ, లెఫ్ట్‌ పార్టీలకు ఒక్క స్థానం కూడా రాలేదు. భాజపాకు 17, జేడీయూ 16, ఎల్‌జేపీ 6 చోట్ల గెలుపొందాయి. ఎన్డీయే కూటమి తరఫున ఈ సారి భాజపా 17, జేడీయూ 16,  చిరాగ్‌ పాసవాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) ఐదు చోట్ల, జితన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవామీ మోర్చా, లోక్‌ సమత పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) చెరో స్థానంలో పోటీ చేయనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని