Tamil Nadu: తమిళనాట ‘ఇండియా’ గాలి

తమిళనాడు, పుదుచ్చేరిలో ఇండియా కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలకు గాను 40  చోట్లా కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగించారు.

Updated : 05 Jun 2024 07:05 IST

పుదుచ్చేరితో కలిపి 40 స్థానాల్లోనూ  ‘కూటమి’ క్లీన్‌స్వీప్‌
భాజపా ఆశలపై నీళ్లు

ఈనాడు-చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరిలో ఇండియా కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలకు గాను 40  చోట్లా కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. ఎన్డీయే, అన్నాడీఎంకే కూటములు ఘోరంగా ఓటమిపాలయ్యాయి. ధర్మపురి, విరుదునగర్‌ లోక్‌సభ స్థానాల్లో పోటీ హోరాహోరీగా సాగింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి వైద్యలింగం గెలుపొందారు. ప్రముఖులపరంగా కాంగ్రెస్‌ నుంచి మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం శివగంగై నుంచి గెలుపొందారు. ఎండీఎంకే అధినేత వైగో కుమారుడు దురై వైగో తిరుచ్చి స్థానం నుంచి ఇండియా కూటమి తరపున విజయబావుటా ఎగురవేశారు.

ఎన్డీయేకు చేదు అనుభవం

తమిళనాడులో 4 నుంచి 7 లోక్‌సభ స్థానాలు తమకు ఖాయమని ఎన్డీయే భావించినా అలా జరగలేదు. తెలంగాణ మాజీ గవర్నర్, భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌ దక్షిణ చెన్నైలో డీఎంకే అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ తమిళచ్చి సౌందరరాజన్‌ చేతిలో ఓడిపోయారు. నీలగిరిస్‌లో డీఎంకే అభ్యర్థి ఎ.రాజా కేంద్ర సహాయమంత్రి ఎల్‌.మురుగన్‌ను మట్టికరపించారు. కోయంబత్తూరులో భాజపా అభ్యర్థి, రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్‌ విజయం నమోదు చేసుకున్నారు. కన్యాకుమారి నుంచి బరిలోకి దిగిన భాజపా కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి విజయవసంత్‌ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఎన్డీయే కూటమి తరఫున తేని నుంచి పోటీ చేసిన ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరణ్‌ డీఎంకే చేతిలో ఓటమి పాలయ్యారు.

డీఎంకే కార్యాలయం వద్ద శ్రేణుల సంబరాలు

అన్నాడీఎంకే అడ్రస్‌ గల్లంతు..

ఎన్డీయే నుంచి వేరుపడిన అన్నాడీఎంకే లోక్‌సభ ఎన్నికల్లో చతికిలపడింది. రెండాకుల గుర్తుతో 34 స్థానాల్లో పోటీచేసి ఒక్కచోటా గెలవలేకపోయింది. ఈ పార్టీతో చేతులు కలిపిన  డీఎండీకే కూడా 5 చోట్ల పోటీచేసినా విజయాన్ని అందుకోలేకపోయింది.


దళపతి స్టాలిన్‌

చెన్నై: జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారింది. కరుణానిధి, జయలలితల తర్వాత స్టాలిన్‌ను తమ నాయకుడిగా తమిళులు నమ్మారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 23 సీట్లు గెలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో ఈసారి తగినన్ని సీట్లు గెలవాలని భాజపా ప్రయత్నించింది. కానీ మోదీ, అమిత్‌ షా, అన్నామలైల వాక్బాణాలకు స్టాలిన్‌ ఎదురు నిలిచారు. మోదీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని.. ఆయన రాష్ట్రానికి వచ్చేది ఓట్లు, జీఎస్టీ కోసమేనంటూ గట్టిగా ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఈ ఎన్నికల్ని రెండో స్వతంత్ర పోరాటమంటూ, గెలిచి తీరాలంటూ.. ఇండియా కూటమికి తిరుగులేని విజయాన్ని అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని