PM Modi: ఓటుబ్యాంకు ముందు విపక్షాల ‘ముజ్రా’

దళితులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను దోచుకోడానికి విపక్ష ‘ఇండియా’ కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు.

Published : 26 May 2024 04:04 IST

బిహార్, యూపీ సభల్లో ప్రధాని ధ్వజం
ఓటమికి ఖర్గేను బాధ్యుణ్ని చేస్తారని జోస్యం

బక్సర్, డెహరీ, బిక్రం (బిహార్‌)/గాజీపుర్‌ (యూపీ): దళితులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను దోచుకోడానికి విపక్ష ‘ఇండియా’ కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. రిజర్వేషన్లు కట్టబెట్టాలని చూస్తున్న ఓటుబ్యాంకు ముందు బానిసలుగా మారిన విపక్షాలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ‘ముజ్రా’ (కచేరీలు, వేడుకల్లో వేశ్యలు చేసే నృత్యాలు) ప్రదర్శిస్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం బిహార్‌లోని బక్సర్, కారాకాట్, పాటలిపుత్ర.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌ లోక్‌సభ నియోజకర్గాల పరిధిలోని ఎన్నికల సభల్లో ప్రధాని మాట్లాడారు. బిహారీల వలసల గురించి ఇతర రాష్ట్రాల నాయకులు అవమానకరంగా మాట్లాడినా ఇక్కడి ఆర్జేడీ నేతలు ఒక్క మాట ఎదురు మాట్లాడే ధైర్యం చేయలేక లాంతరుతో (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) ముజ్రా నృత్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విపక్షాలు అధికారంలోకి వస్తే ముందు చేసే పని ముస్లింలకు రిజర్వేషన్లు మళ్లించినా కోర్టులు ప్రశ్నించకుండా రాజ్యాంగాన్ని మార్చడమేనని అన్నారు. ఈ కూటమి ప్రణాళికలు అమలైతే ఆర్జేడీకి సంప్రదాయ మద్దతుదారులుగా ఉన్న యాదవులతోపాటు అనేక అణగారిన వర్గాలు తమ రాజ్యాంగపరమైన హక్కులను కోల్పోవాల్సి వస్తుందని ప్రధాని హెచ్చరించారు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్‌ ‘రాజకుటుంబం’ తమ ఓటమికి మల్లికార్జున ఖర్గేను బాధ్యుణ్ని చేసి, విదేశాలకు విహారయాత్రకు వెళ్లిపోతుందని జోస్యం చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ సైకిలు (సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు) పంక్చరయిందని తెలిపారు. ‘వన్‌ ర్యాంక్‌.. వన్‌ పెన్షన్‌’ అమలుకాకుండా మాజీ సైనికులను మోసపుచ్చి కాంగ్రెస్‌ నాటకాలు ఆడిందని, మోదీ అధికారంలోకి వచ్చాకే అది అమలైందన్నారు. 

ఫలితాలను ఊహించే.. ఇలా: ఖర్గే

దిలీ,్ల శిమ్లా: ప్రధాని తమను ఉద్దేశించి చేసిన ‘ముజ్రా’ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. మోదీ భాష ఆయనకు దిమ్మతిరిగే ఫలితాలు రాబోతున్నాయనేందుకు సంకేతమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శిమ్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజనీతిజ్ఞుడిలా మాట్లాడవలసిన వ్యక్తి హిందూ, ముస్లిలంటూ పదే పదే రెచ్చగొడుతున్నారని తెలిపారు. భాజపా సీట్లతోపాటు ప్రధాని భాష ఔన్నత్యం కూడా దిగజారుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. యూపీలోని గోరఖ్‌పుర్‌ సభలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లో ప్రధాని ఏం మాట్లాడారో విన్నారా? విపక్షాలపై ఆయన వాడిన భాష దేశ చరిత్రలో మరే ప్రధానీ ఉపయోగించలేదు’’ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని