Modi: ‘పాలే లేవు .. నెయ్యి కోసం కొట్లాట’: విపక్ష కూటమిపై మోదీ ఎద్దేవా

విపక్ష కూటమిలో నేతలు ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని మోదీ (Modi) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

Updated : 23 May 2024 17:20 IST

చండీగఢ్‌: సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ (Modi) విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. విపక్ష ‘ఇండియా’ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన హరియాణాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

విపక్ష కూటమి గురించి మాట్లాడుతూ.. ఆవు ఇంకా పాలు ఇవ్వనేలేదు. కానీ, అక్కడ నెయ్యి కోసం ఘర్షణ మొదలైందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి పదవిని ఉద్దేశించి ఆయన ఈ మాటన్నారు. అలాగే ఐదు సంవత్సరాలకు ఐదుగురు పీఎంలు అని వారే చర్చించుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఎన్నికల్లో మీ ఓటు ప్రధానిని ఎన్నుకోవడంతో పాటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీకు ఒక వైపు మీరు పరీక్షించిన సేవకుడు మోదీ ఉన్నాడు.. అవతలివైపు ఉన్న కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలీదు. ఇండియా బ్లాక్‌లో కులతత్వం, మతతత్వం, బంధుప్రీతి ఎక్కువ. మోదీ ఉన్నంతకాలం దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ దోచుకోలేరు. హరియాణా ప్రజలు నాపై ఎంతో ప్రేమను కురిపించారు. మీతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది’’ అంటూ మోదీ మాట్లాడారు.

‘ఇండియా’ కూటమి క్యాన్సర్‌ కంటే భయంకరం

‘‘1962లో మనం చైనా చేతిలో ఓటమి చవిచూశాం. ఆ ఓటమికి వారు(కాంగ్రెస్‌) సైన్యాన్ని బాధ్యుల్ని చేశారు. మన మిలిటరీని కించపరిచే అవకాశాల కోసం ఆ పార్టీ ఇప్పటికీ ఎదురుచూస్తోంది. పశ్చిమ్ బెంగాల్‌లో రాత్రికిరాత్రి ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేశారు. వాటిని అందుకున్నవారిలో చొరబాటుదారులు కూడా ఉన్నారు. ఇప్పుడు అవి చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చింది’’ అని దుయ్యబట్టారు. విపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఫలాలను వారి ఓటు బ్యాంకుకు అప్పగిస్తారని ఆరోపించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని