BJP: భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్‌ ఎంపీ

భారతదేశపు సంపన్న మహిళ సావిత్రి జిందాల్‌ (Savitri Jindal), బిజేడీ నుంచి 6 సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి భాజపాలో చేరారు.

Updated : 28 Mar 2024 20:07 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట భారతదేశపు సంపన్న మహిళ, హరియాణా (Haryana) మాజీ మంత్రి సావిత్రి జిందాల్‌ (Savitri Jindal) కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. హస్తం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. గురువారం సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఆమె తనయుడు, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్‌ జిందాల్‌ (Naveen Jindal) కాంగ్రెస్‌ను వీడి, భాజపాలో చేరిన రోజుల వ్యవధిలోనే సావిత్రి కూడా అదే పార్టీలో చేరారు.

కుటుంబ సభ్యుల సలహా మేరకు తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఆమె.. గత పదేళ్లుగా ఆదరాభిమానాలు చూపించిన హిస్సార్‌ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. భూపేంద్ర సింగ్‌ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కమల్‌ గుప్త చేతిలో పరాజయం పాలయ్యారు. ఫోర్బ్స్‌ తాజా సంపన్నుల జాబితా ప్రకారం.. సావిత్రి జిందాల్‌ (దివంగత పారిశ్రామిక వేత్త, మాజీ మంత్రి ఓపీ జిందాల్‌ సతీమణి)కి 29.1 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. భారత దేశంలో అత్యంత సంపన్న మహిళ ఆమెనే.


బీజేడీకి షాక్‌.. భాజపా గూటికి భర్తృహరి

సార్వత్రిక ఎన్నికల ముంగిట ఒడిశాలో అధికార బిజు జనతాదళ్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. కటక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మెహతాబ్‌ భాజపాలో చేరారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఆయనకు టికెట్‌ కేటాయించే అవకాశముంది. 2019 ఎన్నికల్లో భాజపా నుంచి బరిలోకి దిగిన ప్రకాశ్‌ మిశ్రాను.. మెహతాబ్‌ భారీ మెజార్టీతో ఓడించారు.

1998లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన మెహతాబ్‌.. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఉత్తమ చర్చ చేసినందుకు గుర్తింపుగా 2017 నుంచి 2020 వరకు నాలుగేళ్లపాటు ఆయనకు ‘సంసద్‌ రత్న’ అవార్డు వరించింది. బీజేడీలో అసురశక్తులు పెరిగిపోయాయని, అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలన్న ధ్యేయంతో ఏర్పడిన ఆ పార్టీ విలువలకు సమాధి కట్టిందన్న భర్తృహరి వ్యాఖ్యలు బీజేడీలో ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. అంతలోనే ఆయన పార్టీ మారడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని