Indore loksabha seat: అత్యధిక మెజార్టీ.. నోటాకు రికార్డు ఓట్లు.. ఒకే చోట!

సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన స్థానాల్లో మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ (Indore) ఒకటి. కాంగ్రెస్‌ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో ఇక్కడ భాజపా అభ్యర్థి విజయం నల్లేరుపై నడకలా మారింది.

Updated : 04 Jun 2024 17:40 IST

Indore loksabha seat | ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన స్థానాల్లో మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ (Indore) ఒకటి. కాంగ్రెస్‌ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో ఇక్కడ భాజపా అభ్యర్థి విజయం నల్లేరుపై నడకలా మారింది. ఇప్పుడు ఆ స్థానం మరో సంచలనానికి వేదికైంది. దేశంలోనే అత్యధిక మెజార్టీ నమోదైన స్థానంగా నిలవడమే కాకుండా.. నోటాకు అత్యధికంగా ఓట్లు పడిన స్థానంగానూ రికార్డుకెక్కింది.

ఇందౌర్‌ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్‌ జరిగింది. భాజపా నుంచి సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ పోటీ చేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతి బామ్‌ మాత్రం చివరి క్షణంలో (ఏప్రిల్‌ 29న) నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. తర్వాత భాజపాలో చేరిపోయారు. దాంతో అక్కడ కాంగ్రెస్‌ పోటీలో లేకుండా పోయింది. దీంతో నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ ‘నోటా’కు ఓటేయాలని ప్రచారం చేసింది. తద్వారా భాజపాకు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసింది.

ఊహించినట్లుగానే భాజపా అభ్యర్థి శంకర్‌ లాల్వానీ 10 లక్షల ఓట్లతో మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఆయనకు 12 లక్షల ఓట్లు పోలయ్యాయి. దేశంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థిగా ఆయన రికార్డులకెక్కారు. ఆయన తర్వాత నోటాకే అత్యధికంగా 2 లక్షలకు పైగా (218674) పోలయ్యాయి. ఓవిధంగా కాంగ్రెస్‌ ప్రచారానికి ఫలితం దక్కినట్లయ్యింది. ఇక్కడ రెండో స్థానంలో ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థి సంజయ్‌కు 51 వేల ఓట్లు పోలయ్యాయి. ఆయనకంటే నోటాకు వచ్చిన ఓట్లే దాదాపు లక్షన్నర అధికం కావడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో 25.13 లక్షల ఓటర్లు ఉన్నారు. ఎన్నికల చరిత్రలో బిహార్‌ గోపాల్‌గంజ్‌ స్థానంలో నోటాకు 51వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును ఇందౌర్‌ అధిగమించింది.

అత్యధిక మెజారిటీలు వీరికే..

సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు భాజపా నేత ప్రీతమ్‌ ముండే పేరిట ఉంది. బీద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆమె 2014లో 6.96 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజాగా ఆ రికార్డును లాల్వానీ అధిగమించారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విదిశ నుంచి 8 లక్షల ఓట్లతో గెలుపొందారు. గతంలో గుజరాత్‌లోని నవసరిలో భాజపా నేత సీఆర్‌ పాటిల్‌ 6.89 లక్షల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. హరియాణాలోని కర్నాల్‌లో సంజయ్‌ భాటియా 6.56 లక్షలు, ఫరీదాబాద్‌లో భాజపా అభ్యర్థి కృష్ణపాల్‌ గుజ్జర్‌ 6.38 లక్షల తేడాతో గెలుపొందారు. రాజస్థాన్‌లోని భిల్వాడాలో సుభాష్‌ బహేరియా 6.12 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌ రెడ్డి 5.37 లక్షల ఓట్లతో గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని