Mlc election: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు: రాకేశ్‌రెడ్డి

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 06 Jun 2024 19:21 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. ఓట్ల లెక్కింపు ఏకపక్షంగా జరుగుతోందని విమర్శించారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే లీడ్ ప్రకటించారన్నారు. సందేహాలను నివృత్తి చేయకుండా ఆర్వోలు ఏకపక్షంగా వ్యవహరించారని, అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని చెప్పారు. ఇదేంటని అడిగితే పోలీసులు బయటకు నెట్టారన్నారు. సుమారు వెయ్యి ఓట్లు గోల్‌మాల్‌ అయ్యాయని ఆక్షేపించారు.

ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ఖండించారు. అధికారుల పనితీరుపై భారాస నేతలు అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఓట్ల లెక్కింపు ఫలితాలు ఆ పార్టీ నేతలకే ముందుగా తెలుస్తున్నాయని చెప్పారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని కేటీఆర్‌ ప్రయత్నించారని ఆరోపించారు. గతంలో మాదిరి గోల్‌మాల్‌ చేసి గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే ప్రస్తుతం అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని చూస్తే.. ఓటమిని ముందుగానే అంగీరించినట్లు తెలుస్తోందన్నారు. 

నల్గొండలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రోజు కూడా కొనసాగుతోంది. తొలి 3 రౌండ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యత కనబరిచారు. ఆయనకు 1,06,234 ఓట్లు, భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 87,356 ఓట్లు, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 34,516 ఓట్లు పోలయ్యాయి. ఇండిపెండెండ్‌ అభ్యర్థికి అశోక్‌కుమార్‌కు 27,493 ఓట్లు వచ్చాయి. తాజాగా నాలుగో రౌండ్‌ లెక్కింపు మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు