Chandra babu: ఇది నా జీవితంలో గర్వించదగ్గ రోజు

దేశ ప్రధానిగా నరేంద్రమోదీ పేరును తెలుగుదేశం పార్టీ తరఫున గర్వంగా సమర్థిస్తున్నానని, ఇది తన జీవితంలో అత్యంత గర్వించదగిన రోజని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు.

Published : 08 Jun 2024 06:33 IST

మోదీని ఎన్డీయే నేతగా ప్రకటించే సందర్భంగా చంద్రబాబు
భారతీయులు ప్రపంచ నాయకులుగా ఎదగడం చూస్తామని వ్యాఖ్య 
ఆయన నాయకత్వంలో దేశం మరింత పురోగమిస్తుందని వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ పేరును తెలుగుదేశం పార్టీ తరఫున గర్వంగా సమర్థిస్తున్నానని, ఇది తన జీవితంలో అత్యంత గర్వించదగిన రోజని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. మానవతావాదం తప్పితే తనకు మరో వాదం తెలియదని తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ప్రకటించారని, దాన్ని ఇప్పుడు మోదీ సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీని ఎన్డీయే కూటమి నేతగా ఎన్నుకునేందుకు పాత పార్లమెంటు భవనం సెంట్రల్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రధాని మోదీ క్షణం విశ్రాంతి తీసుకోకుండా మూడు నెలలపాటు నిర్విరామంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒకే ఉత్సాహం, స్ఫూర్తితో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి నిర్వహించిన మూడు బహిరంగ సభలు, ఒక రోడ్డుషో ఎన్నికల ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయి. హోంమంత్రి అమిత్‌షా ఒకే ఒక శక్తిమంతమైన బహిరంగ సభతో పరిస్థితులను మార్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, గడ్కరీలు వచ్చి బహిరంగ సభల్లో ప్రసంగించి కేంద్రం రాష్ట్రానికి అండగా ఉంటుందన్న విశ్వాసాన్ని కల్పించారు. దేశ చరిత్రలో ఇప్పుడు మనం సంక్లిష్టమైన కూడలిలో ఉన్నాం. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేళ్లలో ఎన్నో గుర్తించదగిన పనులను ప్రారంభించింది. దానివల్ల దేశం అద్భుతమైన పురోగతి, మార్పు సాధించింది. మోదీ స్పష్టమైన దృక్పథం, అంకితభావం దేశాన్ని ప్రపంచశక్తి కేంద్రంగా మార్చింది. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎంతోమంది నాయకులను చూశా. కానీ ప్రపంచం గర్వించే స్థాయికి భారత్‌ను తీసుకెళ్లిన ఘనత మోదీకే దక్కుతుందని గర్వంగా చెబుతున్నా. ఆయన దేశానికి సాధించిపెట్టిన గొప్ప విజయమిది. ఆయన నాయకత్వంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఈసారి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయం. ఇదే సమయంలో ఆయన విజన్‌ 2047 పేరుతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన నాయకత్వంలో దేశం ప్రపంచ ఒకటో/రెండో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న పూర్తి విశ్వాసముంది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులంతా అత్యధిక తలసరి ఆదాయం పొందుతున్నారు. సమీప భవిష్యత్తులో మోదీ నాయకత్వంలో భారతీయులంతా ప్రపంచ నాయకులుగా ఎదగడం చూస్తాం. ప్రభుత్వం, కార్పొరేట్, సేవల రంగంపరంగానూ మనం ప్రపంచానికి సేవలు అందించనున్నాం. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలను సమతౌల్యం చేసుకుంటూ వ్యవస్థను సమాంతరంగా నడపాలి. సమాజంలోని అన్ని స్థాయిల్లో ప్రజలకూ అభివృద్ధి ఫలాలు దక్కాలి. నేను గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశా. కానీ ఇప్పుడు ఏదనుకుంటే దాన్ని సాధించగలిగే స్ఫూర్తిమంతమైన సమయంలో ఉన్నాం. మోదీకి ఉత్సాహం, దార్శనికత, అనుకున్న పనిని కచ్చితంగా అమలుచేసే శక్తిసామర్థ్యాలున్నాయి. తన ప్రభుత్వ విధానాలన్నింటినీ ఆయన స్పష్టంగా అమలు చేశారు. సరైన సమయంలో మోదీలాంటి సరైన నాయకుడు ఉండటం దేశానికి గొప్ప ఆస్తి. ఇది భారత్‌కు మంచి అవకాశం. దీన్ని కోల్పోతే ఎప్పటికీ చేజిక్కదు. ప్రపంచ దేశాలన్నీ 1-2% వృద్ధి రేటుతో సాగుతుంటే భారత్‌ మాత్రం పదేళ్లుగా అత్యధిక వృద్ధి రేటు సాధిస్తోంది. ఇది మరో 10, 20 ఏళ్లు కొనసాగుతుంది. మనకు అందివచ్చిన ఐటీ అవకాశాలను వినియోగించుకుంటున్నాం. యువశక్తి సాఫల్యాలను గమనిస్తున్నాం. ఇదివరకు ఎన్నడూలేని దూకుడుతో ముందడుగు వేయడానికి ప్రధాన కారణం మోదీ నాయకత్వమే. అందుకే ఎన్డీయే కూటమి తరఫున దేశ ప్రధానిగా మోదీ పేరును తెలుగుదేశం తరఫున గర్వంగా సమర్థిస్తున్నా. ఆయన నాయకత్వం వల్ల మనం పేదరికంలేని దేశంగా ఎదగడానికి అవకాశముంది. ఇది చరిత్రాత్మక ఘట్టం. తెలుగుదేశం పార్టీకి ఎన్డీయేతో తొలినుంచి అనుబంధముంది. ఈ ఎన్నికల్లో మాకు చరిత్రాత్మక విజయం లభించింది. ఏపీలో 95% సీట్లు గెలిచాం. గతంలో ఎన్నడూ ఇంతటి ఘనవిజయం లేదు. ఇది ఎన్డీయేపట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. ఎలాంటి శషభిషలు లేకుండా పవన్‌కల్యాణ్, పురందేశ్వరిలతో కలిసి రాష్ట్రంలో మూడు పార్టీలు సమష్టిగా శ్రమించడంతో మంచి ఫలితాలు వచ్చాయి’ అని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కరచాలనం చేసి మోదీ ధన్యవాదాలు తెలిపారు. 

దిల్లీలో తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన ఆ పార్టీ ఎంపీలు, నేతలు


నడ్డా, అమిత్‌షాలతో చంద్రబాబు భేటీ

ఈనాడు, దిల్లీ: ఎన్డీయే నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నుకున్న అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం రాత్రి భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఈ ఇద్దరు నేతలు.. భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. జేపీ నడ్డా నివాసంలో సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో తెదేపా ప్రాధాన్యతల గురించి చంద్రబాబు వారికి వివరించినట్లు తెలుస్తోంది. సమావేశానంతరం ఇక్కడి 50-అశోక రోడ్డులోని నివాసానికి వచ్చిన చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని