PM Modi: దేవెగౌడతో వేదిక పంచుకోవడం ప్రత్యేక అనుభవం: మోదీ

మంగళూరులో ఆదివారం ఎన్డీఏ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన విషయాలను సోమవారం ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.   

Published : 15 Apr 2024 18:57 IST

బెంగళూరు: మంగళూరు రోడ్‌ షో చిరస్మరణీయమైనది. ఎందుకంటే మాజీ ప్రధాని దేవెగౌడతో ఈ వేదికను పంచుకోవడం ఓ ప్రత్యేకమైన అనుభవం అని ఆనందం వ్యక్తంచేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఆదివారం మంగళూరులో ఎన్డీఏ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన విషయాలను సోమవారం ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.  మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఎన్డీఏ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని  పాల్గొన్నారు. ఈసందర్భంగా నారాయణ గురు సర్కిల్ నుంచి నవ ప్రాంతం వరకు సాగిన రోడ్‌ షోలో వేలాదిగా ప్రజలు పాల్గొని మోదీపై పూల వర్షం కురిపించారు. అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహశిల్పి అరుణ్ యోగిరాజ్‌ ప్రధానిని కలిశారు. 

మరో పోస్టులో బహిరంగ సభ విషయం ప్రస్తావించిన మోదీ ‘‘ మైసూరులో బహిరంగ సభ అద్భుతంగా జరిగింది. కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో భాజపా జేడీ (ఎస్‌)కు వచ్చిన మద్దతు అత్యద్భుతం.  ప్రజలు కాంగ్రెస్‌తో విసిగిపోయారు. మా కూటమిని గెలిపించాలని కోరుకుంటున్నారు. మన మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు దేవెగౌడ ఈ ర్యాలీకి వచ్చి తమ ఆలోచనలను పంచుకోవడం చాలా ప్రత్యేకమైన అనుభవం’’ అని పేర్కొన్నారు.

జేడీ(ఎస్) వ్యవస్థాపకుడు దేవెగౌడ మంగుళూరు ర్యాలీ గురించి ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ‘మైసూరులో ఎన్డీఏ కూటమి ర్యాలీ దిగ్విజయంగా సాగింది. ప్రధాని మోదీని కలిసి, మాట్లాడటం ఆనందంగా ఉంది. ఆయన చూపిన ఆప్యాయతకు, దాతృత్వానికి ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను. కర్ణాటకలో 28 సీట్లు సాధించి మోదీ అనుకున్న 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తాం’ అని సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో జేడీ(ఎస్) ఎన్డీఏలో చేరింది. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలు ఉండగా మూడు స్థానాల్లో జేడీ(ఎస్),  25 స్థానాల్లో భాజపా పోటీ చేయనున్నాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని