Kalpana Soren: ఎమ్మెల్యేగా కల్పనా సోరెన్‌ ప్రమాణ స్వీకారం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించిన కల్పనా సోరెన్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 10 Jun 2024 21:51 IST

రాంచీ: ఝార్ఖండ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించిన మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ రవీంద్రనాథ్‌ మహతో ఆమెతో ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్‌, పలువురు జేఎంఎం ముఖ్య నేతలు హాజరయ్యారు.

గందేయ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే (జేఎంఎం) సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి దిలీప్‌ కుమార్‌ వర్మపై 27వేల మెజార్టీతో విజయం సాధించారు. మార్చి నెలలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

ఝార్ఖండ్‌లో విపక్ష కూటమి ‘ఇండియా’ తరఫున కీలక నేతగా ఉన్న కల్పనా సోరెన్‌ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరగనున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార జేఎంఎంలో అంతర్గత కలహాలు రానున్నాయని భాజపా ఆరోపిస్తోంది. అయితే, హేమంత్‌ సోరెన్‌ అరెస్టు అనంతరం పాలనా పగ్గాలు ఆమె చేతుల్లోకే వస్తాయని ప్రచారం జరిగినప్పటికీ.. పార్టీ సీనియర్‌ నేత చంపాయీ సోరెన్‌ సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని