janasena: ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను: పవన్‌

విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated : 07 Dec 2023 19:49 IST

విశాఖ: జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్‌.రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు సైతం చెప్పినట్లు పవన్‌ తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పోరాటం.. అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదం అని.. ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని.. ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పని చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. మార్పు కోసం ఓట్లు కావాలని పవన్‌ వెల్లడించారు.

ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి..

‘‘అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం ఓట్లు అడుగుతా. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల.. అందరినీ ఆహ్వానించే నేల. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి.. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలి. కష్టం వస్తే ఆదుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నా. పదవుల కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నా. ఉత్తరాంధ్రలో కాలుష్యం బాగా తగ్గాలి. ఉత్తరాంధ్రలోని 24 బీసీ కులాలను తెలంగాణలో గుర్తించడం లేదు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇక్కడి వైకాపా నేతలు ఎందుకు అడగలేదు? ఉత్తరాంధ్ర ప్రజలకు వైకాపా నేతలు నష్టం చేస్తున్నారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ (డీసీ) లాభాల బాటలో ఉందంటే నేను చేసిన కృషే కారణం. స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఒక్కరు మాట్లాడటం లేదు. జనసేనకు అండగా నిలబడితే స్టీల్‌ ప్లాంట్‌ కోసం నేను పోరాటం చేస్తా. ఏ అధికారం లేని నేనే ఇంత చేస్తుంటే.. వైకాపా నేతలు ఎంత చేయాలి?. జనసేనకు ఒక్క ఎంపీ ఉంటే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గనులు తెచ్చే వాడిని’’ అని పవన్‌ కల్యాణ్ వివరించారు.

సీఎం ఎవరనేది నేను.. చంద్రబాబు కలిసి నిర్ణయిస్తాం..

‘‘జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా. నా ఓటమి తర్వాత కూడా విశాఖ ప్రజలు నాతో ఉన్నారు. విశాఖ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడాలి. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత కావాలి. ఆడపిల్లల అదృశ్యంపై మాట్లాడితే నన్నంతా ఎగతాళి చేశారు. అమిత్‌ షా లాంటి వ్యక్తులు చెబితేనే నేను మాట్లాడా. ఈ ప్రభుత్వం పోలీసులను సమర్థంగా వినియోగించడం లేదు. తెదేపా-జనసేన ప్రభుత్వం వస్తే పోలీసు శాఖకు పూర్వవైభవం తీసుకొస్తాం. సమర్థులైన పోలీసు అధికారులను నియమించి శాంతిభద్రతలు కాపాడుతాం. బాధ్యతగా మాట్లాడేవారు ఉంటేనే వ్యవస్థలు సరిగా పనిచేస్తాయి. గెలిచిన అన్ని చోట్లా విజయం సాధిస్తేనే మనం బాగా సేవ చేయగలం. రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి. విడిపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే 2014లో భాజపాకు మద్దతిచ్చా. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సి ఉంది. సీఎం ఎవరనేది నేను, తెదేపా అధినేత చంద్రబాబు కలిసి నిర్ణయిస్తాం’’ అని పవన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు