Jyotiraditya Scindia: రాహుల్‌గాంధీ వద్ద అలవర్చుకున్నవి వదిలించుకుంటున్నా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని చూసి నేర్చుకుంటున్నారంటూ ఓ నెటిజన్‌ చేసిన వ్యాఖ్యకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

Published : 08 Jul 2023 01:19 IST

నెటిజన్‌ వ్యాఖ్యకు కేంద్రమంత్రి సింధియా స్పందన 

భోపాల్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని చూసి నేర్చుకుంటున్నారంటూ ఓ నెటిజన్‌ చేసిన వ్యాఖ్యకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. వాస్తవానికి ఆయన దగ్గర అలవర్చుకున్నవాటిని తాను వదిలించుకుంటున్నానని తెలిపారు. అసలేం జరిగిందంటే- ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలకు ప్రచారం కల్పించడంలో భాగంగా సింధియా తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. సంబంధిత వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. రెస్టారెంట్‌లో ఉన్నవారిని సింధియా ఆత్మీయంగా పలకరించడం, ఓ వృద్ధురాలి వద్ద ఆశీస్సులు తీసుకోవడం అందులో కనిపించింది. ‘‘రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు దానిని వండినవారిని కలవడమూ అంతే ముఖ్యం. గ్వాలియర్‌ పర్యటనలో నేను రెస్టారెంట్‌ సిబ్బందితో మాట్లాడాను. రకరకాల వంటల గురించి, స్థానిక అంశాల గురించి తెలుసుకున్నాను’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. దీంతో ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘రాహుల్‌గాంధీ నుంచి నేర్చుకుంటున్నారన్నమాట. మంచి విషయం’’ అని పేర్కొన్నారు. దానికి సింధియా స్పందించారు. రాహుల్‌గాంధీని విమర్శిస్తున్నట్లుగా.. ‘‘నిజానికి వదిలించుకుంటున్నా’’ అని ట్వీటారు. సదరు నెటిజన్‌ మళ్లీ స్పందించి.. ‘‘మీకంటే రాహుల్‌గాంధీకి వినయం, నిజాయతీ ఎక్కువ. కాబట్టి ఆయన నుంచి నేర్చుకోవడం తప్పేమీ కాదు’’ అని పేర్కొన్నారు. గతంలో సింధియా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన సంగతి గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని