Bengaluru: ‘బ్రాండ్‌ బెంగళూరు’.. ప్రజల సలహాల కోసం వెబ్‌సైట్‌: శివకుమార్‌

బెంగళూరు అభివృద్ధిపై దృష్టికేంద్రీకరించిన కాంగ్రెస్‌ సర్కార్‌.. అందుకోసం ప్రజల అభిప్రాయాలు కోరుతూ ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. 

Published : 22 Jun 2023 01:39 IST

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బెంగళూరు(Bengaluru) నగరం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా  బ్రాండ్‌ బెంగళూరు(Brand Bengaluru) పేరిట నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజల సలహాలను కోరుతూ ఓ వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. నగర అభివృద్ధిలో ప్రజల అభిప్రాయాలు ఎంతో కీలకమని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DK Shiva kumar) అన్నారు. ఇప్పటికే బెంగళూరు నగరంలోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. అన్ని రంగాలకు చెందిన బెంగళూరు బ్రాండ్‌ అంబాసిడర్లతోనూ చర్చించామని.. వారితో పాటు ప్రజల అభిప్రాయం కూడా ఎంతో ముఖ్యమన్నారు. అందువల్ల వారి అభిప్రాయాలను సేకరించేందుకే ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్టు డీకేఎస్‌ వెల్లడించారు.

బుధవారం డీకే శివకుమార్‌(DKS) మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు పౌరులతో పాటు విదేశాల్లోని కన్నడిగులు నగర అభివృద్ధి కోసం తమ అభిప్రాయాలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. జూన్‌ 30 లోపు www.brandbengaluru.karnataka.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. మరోవైపు, బెంగళూరు అభివృద్ధే లక్ష్యంగా శనివారం డీకే శివకుమార్ పలు రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. పారిశ్రామిక, ఐటీ, బయోటెక్నాలజీ, విద్య, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాలకు చెందిన 42మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆర్నెళ్లలో బెంగళూరు సమగ్రాభివృద్ధికి ఓ బ్లూప్రింట్‌ సిద్ధం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

ఇటీవల ఎమ్మెల్యేలు, అధికారులు, బ్రాండ్‌ అంబాసిడర్లతో జరిగిన సమావేశంలో పలువురు మెట్రో కనెక్టివిటీ విస్తరణ, మోనో రైల్‌, సబర్బన్‌ రైలు, రోడ్ల విస్తరణ, రింగ్‌ రోడ్డు, ట్రాఫిక్‌ నియంత్రణకు టన్నెల్‌ రహదారుల నిర్మాణం తదితర కీలక సూచనలు చేశారని డీకేఎస్‌ తెలిపారు. వారు చేసిన సూచనల్లో పరిశుభ్రత, పర్యావరణం, వ్యర్థాల నిర్వహణ, కావేరీ నీటి సరఫరా, మురికివాడల అభివృద్ధి, అవినీతి నియంత్రణ, సమర్థ పాలనకు సంబంధించినవి ఉన్నాయన్నారు. అలాగే, బెంగళూరు అభివృద్ధి గురించి చర్చించేందుకు కొందరు సీనియర్‌ నేతల ఇళ్లకు కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు డీకేఎస్‌ వెల్లడించారు. మాజీ సీఎంలతో పాటు మరికొందరిని కలవనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం, భాజపా నేత బసవరాజ్‌ బొమ్మై సమయం కోరానని.. అయితే, ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయినట్టు చెప్పారు. అనుభవం ఆధారంగా ఇచ్చే సూచనలకు వెయిట్‌ ఉంటుందని..అందువల్ల  ట్రాఫిక్‌ రద్దీకి సంబంధించి విశ్రాంత పోలీసు అధికారుల అభిప్రాయాలను సైతం కోరతామన్నారు. బెంగళూరులో టన్నెల్‌ రహదారులు నిర్మించాలంటూ సూచనలు వస్తున్నాయన్నారు. నగరం అభివృద్ధికి రాజకీయ సంకల్పం ఉండాలన్నారు. రహదారులపై గుంతల సమస్యకు వేరే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని